డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రతి గ్రామానికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు

డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రతి గ్రామానికి అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు

cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 11, 12 తరగతులకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా పాఠ్య పుస్తకాలన్నీ ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో ముద్రించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బీఏ, బీకాం లాంటి కోర్సులు చేసి ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే పోటీ ప్రపంచంలో రాణించడం కష్టమవుతుందన్నారు. ప్రతి గ్రామానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. అలాగే అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్దిదారులకు ఆప్షన్ గా ల్యాప్ టాప్ లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నామన్నారు. ఈ చర్యలు విద్యా రంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకొస్తాయన్నారు. జగన్. యూనివర్సిటీల రిక్రూట్ మెంట్లలో సిఫార్సులకు చోటు ఉండరాదన్న సీఎం జగన్.. నియామకాలన్నీ పారదర్శకంగానే జరగాలన్నారు. నాణ్యమైన బోధనా సిబ్బంది యూనివర్శిటీల్లో ఉండాలని స్పష్టం చేశారు.

ఉద్యోగావకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. బీకాం చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలపైన, స్టాక్‌ మార్కెట్‌వంటి వాటిపైన అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఆన్‌లైన్‌లో మంచి కోర్సులు ఉన్నాయని, అందులో మంచి అంశాలను పాఠ్యప్రణాళికలోకి తీసుకురావాలని జగన్ చెప్పారు.

శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) క్యాంప్‌ ఆఫీస్ లో ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు జగన్. ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ (ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌) ఛైర్‌ పర్సన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోవిడ్‌ తర్వాత కాలేజీల ప్రారంభం, క్లాసులు నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు జగన్. ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006ను సవరించడంపై చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలను ప్రతిపాదించారు.

తొలిసారిగా ప్రైవేటు యూనివర్శిటీలు పెట్టేవారికి.. ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని, ఐదేళ్లకాలం పాటు ఇది కొనసాగాలని అన్నారు. ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.