CM Jagan: నాడు-నేడుతో సర్కారు బడికి మహర్దశ: సీఎం జగన్‌

తమ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ వచ్చిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

CM Jagan: నాడు-నేడుతో సర్కారు బడికి మహర్దశ: సీఎం జగన్‌

Cm Jagan

CM Jagan: తమ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ వచ్చిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా సోమవారం నాడు-నేడు రెండో విడత ప్రారంభ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాట్లాడిన జగన్.. కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా చెప్పారు.

తొలి విడత కింద రూ.3,669 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను సర్వాంగ సుందరంగా ఆధునీకరించినట్లు చెప్పిన సీఎం.. నేటి నుంచి ఈ పాఠశాలల పునఃప్రారంభించి విద్యార్థులకు అంకితం చేసినట్లు ప్రకటించారు. అనంతరం మాట్లాడిన సీఎం.. ‘ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామని.. నేడు మూడు కార్యక్రమాలు జరగనున్నాయని.. మొదటిది ఈ రోజు నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కాగా.. జగనన్న విద్యా కానుక, నాడు-నేడు రెండోదశ పాఠశాల పనులకు శ్రీకారం అనే మరో రెండు కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయని చెప్పారు.

ఇక స్కూల్స్ పునఃప్రారంభంపై మాట్లాడిన సీఎం.. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూల్స్ రీఓపెన్ చేశామని.. రెండేళ్ల నుంచి విద్యార్థులకు స్కూల్స్ కు దూరం అయ్యారని.. డబ్ల్యూహెచ్‌ఓ (WHO), ఐసీఎంఆర్‌ (ICMR) సూచనల మేరకు నేడు స్కూల్స్ రీఓపెన్ చేశామని తెలిపారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని ఈ స్కూళ్లను ప్రారంభించగా.. కోవిడ్ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ స్కూల్స్ నడవనున్నాయని తెలిపారు. ఇప్పటికే టీచర్లందరికీ టీకాలిచ్చామని తెలిపిన సీఎం కోవిడ్ పై అప్రమత్తంగా ఉంటూనే స్కూల్స్ కొనసాగించాలని సూచించారు.