విశాఖకు సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చెబుతారు?

విశాఖకు సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చెబుతారు?

cm jagan visakha tour: విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. సీఎం జగన్ నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో నేడు(ఫిబ్రవరి 17,2021) భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖ శారదా పీఠం చేరుకుంటారు సీఎం జగన్. శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. తర్వాత నేరుగా వెళ్లి స్టీల్ ప్లాంట్ జేఏసీ ఉద్యోగులను జగన్ కలుస్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల పాటలో నడిపించాలంటే ఏం చేయాలి? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? కేంద్రం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి? తదితర అంశాలపై సీఎం జగన్ ఆరా తీస్తారు.

అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 22 నుంచి పాదయాత్రక సిద్ధమయ్యారు. జీవీఎంసీ గేటు దగ్గరి నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వరకు ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. నగరమంతా కలిసేలా రోడ్డు మ్యాప్ కూడా తయారు చేశారు విజయసాయిరెడ్డి. మొత్తం 23 కిమీ మేర పాదయాత్ర సాగనుంది. ఇలా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో దూకుడుగా ఉండేలా వైసీపీ ప్రణాళిక రచిస్తోంది. అప్పటికీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోతే ఏం చేయాలన్న దానిపై వైసీపీ నేతలు చర్చిస్తున్నారు.