నా పేరుతో వెయ్యి కోట్లు ఇస్తా, సీఎం కేసీఆర్

నా పేరుతో వెయ్యి కోట్లు ఇస్తా, సీఎం కేసీఆర్

cm kcr announce to give thousand crores: తెలంగాణ సమాజంలో దళిత జాతి ఇంకా వెనుకబడి ఉందని సీఎం కేసీఆర్ వాపోయారు. దళిత జాతి వెనుకకు ఉన్నన్ని రోజులు మనం సిగ్గు పడే పరిస్థితి, బాధ పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాలి వేలి నుంచి నెత్తి వరకు అన్నీ బాగుంటేనే శరీరం బాగుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం అన్నారు. దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మనమీదే ఉందన్నారు. కేసీఆర్ వట్టి మాటలు చెప్పడని అన్నారు.

కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, కొంత అభివృద్ధి కనపడుతోందన్న సీఎం కేసీఆర్… ఇంకా దళితులు పైకి రావాలని ఆకాంక్షించారు. దళితుల కోసం ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో వెయ్యి కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని మరింత పెంచుతామన్నారు. దాన్ని నేనే మానిటర్ చేస్తాను అన్న సీఎం కేసీఆర్, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి చూపిస్తాను అన్నారు. కులం, మతం, వివక్ష లేకుండా తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి చేయాలని అహోరాత్రులు కష్టపడి పని చేస్తున్నాం అని కేసీఆర్ చెప్పారు. ఇటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించి నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు.

ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తాం:
తెలంగాణ వచ్చాక వృత్తి కులాలను ఆదుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు, గొల్లకురమలకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మార్చి తర్వాత మరో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశామన్నారు. ఇక గ్రామాల్లో కటింగ్ షాపులు నడుపుకునే నాయి బ్రాహ్మణులు.. మోడ్రన్ సెల్లూన్లు పెట్టుకుంటామంటే మార్చి తర్వాత ఒక్కొక్కరికి రూ.లక్ష అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం అమలు చేస్తామన్నారు.

”యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత నాదే. మత్స్యకారులను ఆదుకుంటున్నాం. రూ.160కోట్ల కోటి 60లక్షల చేప పిల్లలు ఉచితంగా ఇచ్చాం. అనేక వృత్తి కులాలను పైకి తెచ్చే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్ల మీదనో చింత చెట్టు కిందనో క్షవరం చేస్తున్నారు. ఆ పరిస్థితి పోవాలి. రాబోయే రోజుల్లో బడ్జెట్ తర్వాత ప్రతి గ్రామంలో నాగరికంగా ఉండేలా, సంస్కారవంతంగా ఉండేలా ఆధునిక క్షౌరశాలలు(మోడ్రన్ సెలూన్స్) ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్క నాయి బ్రాహ్మణ సోదరుడికి లక్ష రూపాయల చొప్పున మంజూరు చేయబోతున్నాం” అని కేసీఆర్ చెప్పారు.

నల్లగొండ జిల్లాపై వరాల జల్లు:
హాలియా బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. నల్లగొండ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రతి పంచాయతీకి రూ. 20 లక్షలు, ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ. 5 కోట్లు ప్రకటించారు. మొత్తంగా నల్లగొండ అభివృద్ధికి రూ.186 కోట్లను అనౌన్స్ చేశారు. నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తామని తెలిపారు. పెద్దదేవులపల్లికి నీళ్లు అందిస్తామని, కృష్ణ, గోదావరి అనుసంధానం చేసి రైతులు కాళ్లు కడుగుతామని కేసీఆర్ చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ అని.. వీపు చూపించే పార్టీ కాదన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని, ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అందరూ కష్టపడి పని చేయాలని నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్.