KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. ఢిల్లీలో ఏ రోజు ఏం చేశారంటే!

తొమ్మిదిరోజుల్లో సీఎం ఢిల్లీలో ఏ రోజు ఎవరిని కలిశారనేదానిపై ఓలుక్కేద్దాం.

KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. ఢిల్లీలో ఏ రోజు ఏం చేశారంటే!

Cm Kcr Delhi Tour1

CM KCR : సుదీర్ఘ ఢిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ(గురువారం సెప్టెంబర్ 9, 2021) హైదరాబాద్ చేరుకున్నారు. తొమ్మిదిరోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపారు సీఎం. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలిశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటి మంజూరు, సౌకర్యాల కల్పనకు నిధుల విడుదలపై విజ్ఞప్తిచేశారు. తెలంగాణ జిల్లాల్లో వాన, వరద పరిస్థితిపైనా అక్కడినుంచే రివ్యూ చేశారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొమ్మిదిరోజుల్లో సీఎం ఢిల్లీలో ఏ రోజు ఎవరిని కలిశారనేదానిపై ఓలుక్కేద్దాం.

కేసీఆర్ ఢిల్లీ డైరీ

సెప్టెంబర్ 1 బుధవారం, 2021 :  హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో మ. 3.30 నిమిషాలకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు సీఎం కేసీఆర్. ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల బృందానికి ఎంపీ నామా నాగేశ్వరరావు డిన్నర్ అరేంజ్ చేశారు. పార్టీ ఆఫీస్ శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటిఆర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఢిల్లీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలను పేరు పేరునా సీఎం పలకరించారు.

సెప్టెంబర్ 2 గురువారం, 2021 : మ.1 గంట సమయంలో ఢిల్లీ TRS పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రాంగణానికి చేరుకున్నారు కేసీఆర్. కేసీఆర్ కు టీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలు ఘన స్వాగతం పలికారు. 1.48గంటలకు తన సతీమణితో కలిసి టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ ఆఫీస్ భూమిపూజలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 3 శుక్రవారం,  2021 : ముందుగా నిర్ణయించిన 3 రోజుల సీఎం టూర్ పొడిగిస్తున్నట్టు సీఎంఓ అధికారులు ప్రకటించారు. రాత్రి ఏడు గంటలకు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో పీఎం నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. దాదాపు 50నిమిషాల పాటు చర్చించారు.  పది కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.

సెప్టెంబర్ 4 శనివారం, 2021 : నాలుగోరోజు మ.3 గంటలకు సీఎం కేసీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.  విభజన హామీలు సహా 40 నిమిషాల పాటు పలు అంశాలపై డిస్కస్ చేశారు.

సెప్టెంబర్ 6 సోమవారం, 2021 : ఆరోరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రోడ్ల విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై చర్చించారు. గడ్కరీకి ఐదు విన్నపాలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి 7 గంటలకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు కేసీఆర్. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాకి సంబంధించిన పూర్తి ఆధారాలను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు సమర్పించారు కేసీఆర్. జల వివాదాలు, కేంద్రం గెజిట్ పై 40 నిమిషాల పాటు చర్చించారు. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు న్యాయబద్దమైనవేనంటూ కేసీఆర్ ఆధారాలు చూపించారు.

సెప్టెంబర్ 7 మంగళవారం, 2021 : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదపై..  ఏడోరోజున ఢిల్లీలోని తన ఇంట్లోనుంచి రివ్యూ చేశారు సీఎం కేసీఆర్.  సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సెప్టెంబర్ 9 గురువారం, 2021 :  తొమ్మిదోరోజు ఉదయం ఢిల్లీలో బయల్దేరారు కేసీఆర్.  సాయంత్రం 3గంటలకు హైదరాబాద్ కు చేరుకున్నారు.