నెహ్రూ సమానుడు పీవీకి భారతరత్న ఇవ్వాలి, HCU కి పీవీ పేరు పెట్టాలి, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలి, పార్లమెంటులో శాశ్వతంగా చిత్రపటం ఉంచాలి

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 07:33 PM IST
నెహ్రూ సమానుడు పీవీకి భారతరత్న ఇవ్వాలి, HCU కి పీవీ పేరు పెట్టాలి, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలి, పార్లమెంటులో శాశ్వతంగా చిత్రపటం ఉంచాలి

మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం(జూన్ 28,2020) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్, పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. పీవీ ఘాట్ దగ్గర అంజలి ఘటించి నివాళి అర్పించారు. వచ్చే ఏడాది జూన్ 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పీవీ నరసింహారావుపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

పీవీ.. తెలంగాణ ఠీవీ, బహుముఖ ప్రజ్ఞాశాలి, గడ్డు కాలంలో ప్రధాని పీఠం అధిష్టించి చక్రం తిప్పిన అపర చాణక్యుడు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఈ తరం పాలకులకు ఆదర్శంగా నిలిచిన మహా నేత పీవీ నరసింహారావు అని కేసీఆర్ అన్నారు. దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి పీవీ. ఆధునిక భారత దేశం దిశా నిర్దేశకుడిగా గుర్తింపు పొందిన పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.

* నెహ్రూ సమానుడైన పీవీకి భారతరత్న ఇవ్వాలి
* పీవీ పేరిట పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతాం
* హెచ్ సీయూకి పీవీ పేరు పెట్టాలని ప్రధానికి లేఖ రాస్తా
* తెలంగాణలో 4, ఢిల్లీలో ఒకటి పీవీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తాం
* అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తాం
* రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ మెమోరియల్ కంటే అద్భుతమైన మెమోరియల్ ను పీవీ ఘాట్ లో ఏర్పాటు చేస్తాం
* పార్లమెంటులో కూడా పీవీ చిత్రపటం కూడా శాశ్వతంగా ఉండాలి

360 డిగ్రీస్‌ పర్సనాలిటీ..పీవీ:
పీవీ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీస్‌ పర్సనాలిటీ పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీ గొప్ప సంస్కరణ శీలి అని కితాబిచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఆయన మాటకు ఎంతో విలువ ఉండేదన్నారు. పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవన్నారు. పీవీ స్థాపించిన పాఠశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు వచ్చారని చెప్పిన కేసీఆర్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆయన పాఠశాల నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. నవోదయ వంటి పాఠశాల ఏర్పాటులో పీవీ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు.

పీవీ మన ఠీవీ:
1200 ఎకరాల భూస్వామి అయిన పీవీ.. ఓ 150 ఎకరాలు మాత్రమే ఉంచుకుని మిగతా అంతా ఉదారంగా ప్రభుత్వానికి అప్పగించిన గొప్ప వ్యక్తి. అందుకే పీవీ మన ఠీవీ అని నేను అంటున్నా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ముఖ్యంగా భూసంస్కరణలు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండే వ్యక్తి. ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం చేరేవరకూ పట్టు సడలించేవారు కాదు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశమంతా అంధకారమయంలో ఉంది. ఉన్న బంగారమంతా విదేశీ బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో ఆయన్నే వెతుక్కుంటూ పదవి వచ్చింది. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించి సంచలనం రేపారు’’ అని పీవీని ప్రశంసించారు కేసీఆర్.