పచ్చిమోసం, ఆ ముష్టి రాకపోయినా పర్లేదు, కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్ ఫైర్

లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.20లక్షల కోట్లతో

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 06:14 AM IST
పచ్చిమోసం, ఆ ముష్టి రాకపోయినా పర్లేదు, కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్ ఫైర్

లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.20లక్షల కోట్లతో

లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని బాహుబాలి ప్యాకేజీగా కేంద్రం అభివర్ణించింది. ఈ ప్యాకేజీ కింద పలు రంగాలకు డబ్బు కేటాయించింది. కాగా, కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆ ఆర్థిక ప్యాకేజీ ఒట్టి డొల్ల అని అన్నారు. అదో పచ్చిమోసం అని, బోగస్‌ ప్యాకేజీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయంలో మోడీ సర్కారు అనుసరించిన తీరు రాష్ట్రాలను బిచ్చగాళ్లగా మార్చే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరి సమాఖ్య వ్యవస్థలకు విఘాతం కలిగించేలా, బాధాకరంగా ఉందన్నారు. ప్యాకేజీతో కేంద్రం తన పరవు తానే తీసుకుందన్నారు. ప్యాకేజీ అమలు చేసే విధానం ఇది కాదన్నారు.

కేంద్రం తన పరువు తానే తీసుకుంది:
సోమవారం(మే 18,2020) కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ‘మా మెడపై కత్తి పెట్టి అది చెయ్యి.. ఇది చెయ్యి అంటూ ఆంక్షలు విధిస్తారా…?’ అని ప్రశ్నించారు. రాష్ట్రాలపట్ల కేంద్రం అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్యాకేజీ, రాష్ట్రాలకు విధించిన నియమ నిబంధనల వల్ల కేంద్రం తన పరువును తానే తీసుకుందని విమర్శించారు. కరోనా విపత్తు నేపథ్యంలో తమకు ఆర్థిక సాయం అందించటం ద్వారా ఆదుకోవాలంటూ రాష్ట్రాలు కోరితే.. అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కరణలు అమలు చేస్తే.. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిమితిని పెంచుతామంటూ కేంద్రం చెప్పటం దారుణమని అన్నారు. 

ఆ ముష్టి రెండున్నర వేల కోట్ల ప్యాకేజీ రాకపోయినా ఫరవాలేదు:
విద్యుత్‌, మున్సిపల్‌, మార్కెట్‌ రంగాల్లో సంస్కరణలు చేపడితేనే రుణ పరిమితి పెంచుతారా..? అని ప్రశ్నించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తామెంతో ముందున్నామని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం అంగీకరించదు, అనుమతించబోదని స్పష్టం చేశారు. ‘ఆ ముష్టి రెండున్నర వేల కోట్ల ప్యాకేజీ రాకపోయినా ఫరవాలేదు…’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చెప్పిన ‘సహకార సమాఖ్య వ్యవస్థ’ అనేది ఒట్టి బోగస్‌, అంతా గ్యాస్‌ అని విమర్శించారు. అసలు కేంద్రం ప్రకటించింది ఒక ప్యాకేజీయేనా..? ఇదేమైనా పిల్లల కొట్లాటా..? అని పశ్నించారు. ఇది ఒక అంకెల గారడీ అంటూ అంతర్జాతీయ పత్రికలే కథనాలు రాశాయని గుర్తుచేశారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ దుర్మార్గమైనదన్నారు. నియంతృత్వ వైఖరితో ఉన్న ప్యాకేజీని ఖండిస్తుమన్నారు.

ప్రజల మెడ మీద కత్తి పెడితేనే డబ్బులు ఇస్తారట:
”కరోనా ఘోరవిపత్తుతో ప్రపంచం, దేశాలు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి. ఇది అనేక రూపాల్లో ప్రజలకు పంపిణీ అవుతుంది. కేంద్రం పెంచిన 2 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితితో రూ.20 వేల కోట్లు వస్తాయి. ఇందులో రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వదు. తొలుత రూ.5 వేల కోట్లు వస్తాయి. ఆ తరువాత ప్రతి రూ. 2500 కోట్లకు ప్రజల మెడపై కత్తి పెడితే ఇస్తారట. ఇదేనా ప్యాకేజీ? సమాఖ్య స్ఫూర్తితో అవలంబించాల్సిన విధానం ఇది కాదు. రాష్ట్రాలతో కేంద్రం ఇలాగేనా వ్యవహరించేది? పట్టణాల్లో పన్నులు పెంచి ప్రజలపై భారం వేస్తే ప్రోత్సాహకాలు ఇస్తారట. ఇదేం బేరం? అంతా గ్యాస్. రాష్ట్రాలపై ఈ రకమైన పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థకు విఘాతం. ఇదేమైనా పిల్లల కొట్లాటనా? కేంద్రం చెప్పిన మూడు సంస్కరణలు ఎప్పుడో పూర్తిచేశాం. ఒకే దేశం… ఒకే రేషన్ విధానంలో నెం.1గా ఉన్నాం. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేయబోం. ఆ డబ్బు తీసుకోం. అదీ చేస్తే అన్నీ ప్రైవేటుకే. ఇంకేం ఉండవు. విద్యుత్తు సంస్కరణలు అమలు చేయకుండా ఏదేమైనా తట్టుకుని నిలబడతాం” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Read: తెలంగాణలో వీటికి అనుమతి లేదు