పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం, ఏం చెప్పబోతున్నారు ?

పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం, ఏం చెప్పబోతున్నారు ?

CM KCR meeting : టీఆర్‌ఎస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారాయన. 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. ఆ మీటింగ్‌లో గులాబీ అధినేత లీడర్లకు ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు ? తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు గత కొంతకాలంగా ఎదురుగాలి వీస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్‌లో అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌.

పార్టీ నేతలు కూడా నైరాశ్యంతో ఉండటంతో.. వారిలో జోష్ నింపేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారాయన. ఏప్రిల్ నెలలో జరిగే గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం చేస్తూ.. క్యాడర్‌ను బలపరిచేందుకు సిద్ధమయ్యారు. గతేడాది కోవిడ్ వల్ల పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరగలేదు. ఈసారి దాన్ని ఘనంగా చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్‌. ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో దానిపై చర్చించనున్నారు. రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్‌లను ఆ సమావేశానికి ఆహ్వానించారు. భవిష్యత్తులో నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో దిశానిర్ధేశం చేయనున్నారు కేసీఆర్.

ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీజేపీ నేతలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అనేక అంశాలపై క్రియాశీలకంగా ఉన్న నేతలనే టార్గెట్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌.. వాటిని క్షేత్రస్థాయిలో ఎదుర్కునేందుకు దిశానిర్ధేశం చేస్తారని అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదును మొదలుపెడుతుంది. అందుకోసం జిల్లాల వారీగా పలువురు నేతలకు ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ప్రతీ నియోజకవర్గంలో ఇంచార్జ్‌, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఆ తర్వాత గ్రామస్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేసేందుకు కేసీఆర్‌ షెడ్యూల్ విడుదల చేస్తారు.
మరోవైపు.. పార్టీ వ్వవస్థాపక దినోత్సవం నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక పూర్తి చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకోసం కొత్త అధ్యక్షుడిని ప్లీనరీలో అధికారికంగా ప్రకటిస్తారు. ఇక, దాదాపు 60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వారికి ప్రమాద భీమాను కూడా పార్టీ కల్పించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది సభ్యత్వాన్ని తీసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది గులాబీ పార్టీ.