రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్…పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

  • Published By: bheemraj ,Published On : December 10, 2020 / 08:12 PM IST
రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్…పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

CM KCR Delhi tour : తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు పలువురు నేతలు కూడా వెళ్తున్నారు. ప్రధాని మోడీని కలిసేందుకు తెలంగాణ సీఎంవో అధికారులు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరలేదు. దీంతో ప్రధానిని కలిసే అవకాశం లేనట్లే. ఢిల్లీ టూర్‌లో సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.



తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల అమలుకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టటం కోసం సీఎం కేసీఆర్ ప్రధానిని కలువనున్నారు. అపాయింట్‌మెంట్‌ ఖరారైతే సీఎం కేసీఆర్ మోడీని కలువనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను చర్చించనున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళన ఉదృతమవుతున్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.



ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్… కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తో సహా మరికొందరు కేంద్రమంత్రులను కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను మంజూరు చేయాలని వారిని కోరనున్నారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి భూమిని పరిశీలించి, శంకుస్థాపన చేయడానికి ఏర్పాటు చేస్తారని సమాచారం



కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో చలిలో వణుకుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన కేసీఆర్… రైతు సంఘం నేతలతో ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది. రైతు సంఘాలతో భేటీపైన సస్పెన్స్ కొనసాగుతోంది.