అట్టుడుకుతున్న రష్యా : అలెక్సీ నావల్నీ విడుదల చేయాలంటూ ఆందోళనలు

అట్టుడుకుతున్న రష్యా : అలెక్సీ నావల్నీ విడుదల చేయాలంటూ ఆందోళనలు

Alexei Navalny : రష్యాలో ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చలి తీవ్రంగా వణికిస్తోన్న లెక్కజేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తోన్నారు. దీంతో రోడ్లన్నీ నిరసనకారులతో కిక్కిరిసిపోతోన్నాయి. రష్యా ప్రతిపక్ష నేత, అవినీతి వ్యవహారాలపై తరచూ ఉద్యమాలను నిర్వహించే అలెక్సీ నవాల్ని అరెస్ట్ ఉదంతం.. రష్యాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటైన రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పార్టీ నాయకుడాయన. అయిదు రోజుల కిందట జర్మనీ నుంచి వచ్చిన అలెక్సీని పుతిన్‌ ప్రభుత్వం వచ్చి రాగానే అదుపులోకి తీసుకుంది. మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో అలెక్సీ దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. నావల్నీని అరెస్ట్ చేయడం పట్ల ఆయన మద్దతుదారులు లక్షలాది మంది నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రష్యాలోని ప్రధాన నగరాలు సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. లక్షలాదిగా రోడ్డెక్కి, ఆందోళనలకు దిగారు. ఇది కాస్తా క్రమంగా హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసేవరకు వెళ్లింది. చాలా మంది తలలు పగిలిపోయాయి. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో వేల మంది నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ సహా రష్యా వ్యాప్తంగా ఈ ఆందోళనలు ఏకకాలంలో జరిగాయి. లక్షలాది మంది అలెక్సీ నవాల్నీ మద్దతుదారులు, ఫ్యూచర్ ఆఫ్ ద రష్యా కార్యకర్తలు, అభిమానులు రోడ్డెక్కారు. ఎన్నికలను నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని మాస్కోలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జోరుగా కురుస్తోన్న మంచును సైతం వారు లెక్కచేయలేదు. మాస్కో వ్యాప్తంగా వేలాది మంది ఆందోళనకారులు అధికార భవనాల వద్ద బైఠాయించారు. పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహించారు. ఆయన బొమ్మలను అవమాన పరిచే విధంగా కాళ్లతో తొక్కి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పోలీసులు సీన్‌లోకీ ఎంట్రీ ఇచ్చి, ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిపై దొరికినట్లు లాఠీఛార్జీ చేశారు.

అయితే ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. లాఠీ దెబ్బలు తగులుతున్న వారు వెన్నక్కి తగ్గలేదు. దీంతో పుష్కిన్ స్క్వేర్ వద్ద బైఠాయించిన మూడు వేలమందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అలెక్సీ నావల్ని భార్య యులియా నవల్నాయా కూడా ఉన్నారు. నిరసనకారులను నిరోధించడానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో అక్కడ పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి.