Bengaluru : పోలీసుల కస్టడీలో కాంగో దేశస్ధుని మృతి… బెంగుళూరులో ఆఫ్రికన్ల నిరసన

ఆఫ్రికన్లు, పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడంటూ జేసి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గుండెపోటుతో జోయల్ మరణించలేదని పోలీసు వేధింపుల వల్లే మరణించాడంటూ ఆఫ్రికన్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

Bengaluru : పోలీసుల కస్టడీలో కాంగో దేశస్ధుని మృతి… బెంగుళూరులో ఆఫ్రికన్ల నిరసన

African

Bengaluru : బెంగుళూరు నగరం డ్రగ్ మాఫియాకు కేంద్రంగా మారింది. డ్రగ్స్ సరఫరాపై గత కొంతకాలంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నిషేదిత డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో కాంగో దేశానికి చెందిన జోయెల్ మాలు అనే యువకుడిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న జోయెల్ మృతి చెందటం ప్రస్తుతం ఉద్రిక్తతలకు కారణమైంది. గుండెపోటుతోనే జోయెల్ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రికన్లు, పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతను చనిపోయాడంటూ జేసి నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గుండెపోటుతో జోయల్ మరణించలేదని పోలీసు వేధింపుల వల్లే మరణించాడంటూ ఆఫ్రికన్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. పోలీస్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు చెదరగొట్టి లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు ఆఫ్రికన్లు గాయాలపాలవ్వగా, ఓ పోలీసుకు దెబ్బలు తగిలాయి.

ఆందోళనల నేపధ్యంలో జోయెల్ మృతిపై విచారణ ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2107లోనే జోయెల్ వీసా ముగిసినా చట్ట విరుద్ధంగా ఇక్కడే ఉంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు జాతి వివక్ష పాటిస్తున్నారని, పదే పదే డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రొఫెషనల్స్ హక్కులు పరిరక్షించేందుకు ఏర్పడిన పాన్ ఆఫ్రికన్ ప్రొటెక్షన్ సంస్ధ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు బెంగుళూరు అడ్డగా చేసుకుని డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఆరుమాసాల కాలంలో 3వేలకు పైగా డ్రగ్ కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఓ ఆఫ్రికన్ నుండి 32 లక్షల విలువైన డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర వేల కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.