Addanki Dayakar Says Sorrry : నోరు జారా.. ఐయామ్ వెరీ సారీ.. కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్

ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ద‌యాక‌ర్ తెలిపారు. తన వ్యాఖ్య‌ల ప‌ట్ల బాధ ప‌డుతున్న కోమ‌టిరెడ్డి అభిమానులు త‌న‌ను క్ష‌మించాల‌ని ఆయ‌న కోరారు.

Addanki Dayakar Says Sorrry : నోరు జారా.. ఐయామ్ వెరీ సారీ.. కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్

Addanki Dayakar Says Sorrry : భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఉద్దేశించి సొంత పార్టీ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అద్దంకి దయాకర్ వాడిన పదాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు దయాకర్ పై మండిపడ్డారు. దీంతో అద్దంకి దయాకర్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంటక్ రెడ్డికి ఆయన క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని నిర‌సిస్తూ శుక్ర‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మునుగోడులోని చండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు హాజ‌రైన తుంగ‌తుర్తికి చెందిన అద్దంకి ద‌యాక‌ర్‌… వెంక‌ట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీలో ఉంటే ఉండు..లేకుంటే వెళ్లిపో అంటూ బూతు పదం వాడారు.

అద్దంకి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోమ‌టిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ స‌భ‌కు క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డి కూడా హాజ‌రైన నేప‌థ్యంలో ఆయ‌నే సాక్షిగా అద్దంకికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సొంత పార్టీ ఎంపీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు వారంలోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కాంగ్రెస్ పార్టీ అదేశించింది.

ఈ నోటీసులు అందుకున్న మ‌రుక్ష‌ణ‌మే ద‌యాక‌ర్ స్పందించారు. తాను ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా బేషరతుగా క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు ద‌యాక‌ర్ తెలిపారు. తన వ్యాఖ్య‌ల ప‌ట్ల బాధ ప‌డుతున్న కోమ‌టిరెడ్డి అభిమానులు త‌న‌ను క్ష‌మించాల‌ని ఆయ‌న కోరారు. సభలో ప్రజల నుంచి వచ్చిన స్పందనతో ఈ తప్పు దొర్లిందని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన కొంతమంది నాయకులు దీనిపై అసంతృప్తిగా ఉండటంతో తన వ్యాఖ్యలపై తాను పునరాలోచన చేసినట్లు అద్దంకి దయాకర్ తెలిపారు. పార్టీకి న‌ష్టం చేయాల‌న్న ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్నారు. త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేలోగానే షోకాజ్ నోటీసు జారీ అయ్యింద‌ని, భ‌విష్య‌త్తులో మ‌రోమారు ఇలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాన‌ని అద్దంకి దయాకర్ వెల్లడించారు.

అసలు అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..
”అటువైపు దొంగలు ఉన్నారు. వెంకట్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ మీరు. మీరు ఇటు పక్కన అటు పక్కన. ఈ గట్టున ఉంటావా. ఆ గట్టున ఉంటావా. ఏ గట్టున ఉంటావో తేల్చుకో వెంకట్ రెడ్డి. ఇయాళ నువ్వు ఎక్కడున్నావ్? ఎవరు అమిత్ షా. ఎవరు మోదీ. నీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఢిల్లీలో మోదీ, అమిత్ షా ల దగ్గర మోకరిల్లుతున్నావ్. వెంకట్ రెడ్డి ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో అనే క్రమంలో బూతు పదం (దె***య్) వాడేశారు అద్దంకి దయాకర్. ఆయన వాడిన ఆ బూతు పదం తీవ్ర దుమారమే రేపింది. పార్టీలకు అతీతంగా అద్దంకి దయాకర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాంటి భాష వాడటంపై అంతా అభ్యంతరం వ్యక్తం చేశారు.