అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

Congress leader watching porn: ఆయన ఓ ప్రజాప్రతినిధి. బాధ్యతాయుతమైన పదవి. ఎంతో హుందాగా వ్యవహరించాలి. చట్టసభలో కూర్చొని ప్రజలకు సంబంధించిన పనులు చేయాలి. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. అలాంటి ప్రజాప్రతినిధి దారితప్పాడు. తన హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయాడు. ఏకంగా అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

కర్ణాటక విధాన పరిషత్ సమావేశంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిన్న(జనవరి 29,2021) విధాన పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పాల్గొన్నారు. కాగా సమావేశాలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడడంలో మునిగిపోయారాయన. ఇది గమనించిన ఓ టీవీ చానల్ కెమెరామెన్ దానిని చిత్రీకరించడంతో విషయం వెలుగు చూసింది.

విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే, కర్నాటక చట్టసభల్లో ఇలా అభ్యంతరకర వీడియోలు చూస్తూ సభ్యులు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ముగ్గురు బీజేపీ మంత్రులు లక్ష్మణ సావాడి, సీసీపాటిల్, కృష్ణ పాలేమర్ ఇలానే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు.

అశ్లీల వీడియోల వ్యవహారం రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపడంతో ప్రకాశ్ రాథోడ్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో తాను అడిగిన ప్రశ్నకు సంబంధించిన సందేశాలను ఓ మంత్రికి అందజేసేందుకు సెల్‌ఫోన్‌లో వెతికానని తెలిపారు. ఈ క్రమంలో ఫోన్ లో స్టోరేజీ ఫుల్ కావడంతో అక్కర్లేని వీడియోలను డిలీట్ చేశానని వివరణ ఇచ్చారు. అంతే తప్ప తాను పోర్న్ చూడలేదని సెలవిచ్చారు.

రెండు విడతలుగా నిర్వహిస్తున్న కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం(జనవరి 28,2021) ప్రారంభం కాగా, తొలిరోజే ప్రభుత్వం 11 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వీటిపై రెండోరోజైన శుక్రవారం అసెంబ్లీలో, మండలిలో కీలక చర్చ జరిగింది. బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దీన్ని పోర్న్ గేట్ 2.0గా మీడియా, సోషల్ మీడియా అభివర్ణిస్తోంది. ఇందుకా మిమ్మల్ని చట్టసభలకు పంపింది? అని నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.