తక్కువ ఖర్చుతో జనుము-రాగితో తాగునీటి శుద్ధి, ఐఐటీ సైంటిస్టుల ఆవిష్కరణ

స్వచ్చమైన, సురక్షితమైన తాగునీరు తాగాలని అందరూ కోరుకుంటారు. నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 03:33 AM IST
తక్కువ ఖర్చుతో జనుము-రాగితో తాగునీటి శుద్ధి, ఐఐటీ సైంటిస్టుల ఆవిష్కరణ

స్వచ్చమైన, సురక్షితమైన తాగునీరు తాగాలని అందరూ కోరుకుంటారు. నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి

స్వచ్చమైన, సురక్షితమైన తాగునీరు తాగాలని అందరూ కోరుకుంటారు. అయితే నీటిని ఎక్కువ రోజుల నిల్ల ఉంచడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నిల్వ ఉంచిన నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి. వీటి కారణంగా అనేక రోగాలు వస్తున్నాయి. నిల్వ ఉంచుకునే నీటిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను చంపేందుకు అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతులకు చాలా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత చౌకగా నీటిని శుద్ధిచేసే లక్ష్యంతో నిల్వ చేసే తాగునీటిలో హానికారక సూక్ష్మజీవుల చేరికను నిరోధించేందుకు ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. చౌకగా అందుబాటులో ఉండే జనపనారకు రాగిపూత పూసి వాడటం ద్వారా తాగునీటి కాలుష్యాన్ని అడ్డుకోవచ్చని, తద్వారా కలుషిత నీటితో వచ్చే వ్యాధులను నివారించవచ్చని వీరు చెబుతున్నారు. ఈ మేరకు మద్రాస్‌ ఐఐటీలోని రసాయన శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ చాంద్‌ ప్రయోగాలు చేపట్టారు. 

చౌకగా నీటి శుద్ధి:
బిందెలు, కుండల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం మనమందరం చేసే పనే. అయితే ఇలా నిల్వచేసిన నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు ఉత్పత్తయ్యే అవకాశాలెక్కువ. ఈ సూక్ష్మజీవుల వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి అనేక రోగాలు వస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నీటిని కాచి వడబోసి వాడాలని చెబుతారు. కానీ నీటిని కాచేందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది. పైగా పర్యావరణానికీ అంత మంచిది కాదు. పోనీ రివర్స్‌ ఆస్మాసిస్‌ వంటి టెక్నాలజీలను వాడే వాటర్‌ ఫిల్టర్లను కొందామా? అంటే చాలామంది ఈ ఖర్చు భరించలేరు. వీటితో నీటివృథా కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో వీలైనంత చౌకగా నీటిని శుద్ధిచేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అదే జనుము, రాగితో నీటి శుద్ధి.

1

జనుము, రాగితో మెరుగైన ఫలితాలు:
బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను చంపేందుకు రాగి భేషుగ్గా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. అందుకే రాగి చెంబు లేదా గ్లాస్‌లో ఉంచిన నీటిని తాగుతారు. అయితే ఒక పరిమితి దాటాక రాగితో మనిషికి ప్రమాదం ఏర్పడవచ్చునని, అది నీటిలోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ చాంద్‌ తెలిపారు. రాగిని మెరుగ్గా వాడేందుకు తాము చేసిన పరిశీలనల్లో జనుము గురించి తెలిసిందని, చౌకగా లభించడం, నీటిపై తేలియాడే లక్షణం కారణంగా దీన్ని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. 

5 రోజుల తర్వాత కూడా స్వచ్చమైన నీరు:
జనుమును చిన్నచిన్న పూసల్లా చేసి దానిపై కుప్రస్‌ ఆక్సైడ్‌ లేదా రాగిని పూతగా పూసి నీటిని నిల్వ ఉంచిన పాత్రలో వేస్తే వాటిల్లో సూక్ష్మజీవులు అసలు ఉత్పత్తి కాలేదని ప్రయోగపూర్వకంగా గుర్తించామని చెప్పారు. సాధారణ నీటితో పోల్చినప్పుడు 5 రోజుల తర్వాత కూడా రాగితో కూడిన జనుము పూసలు ఉన్న నీటిలో బ్యాక్టీరియా అతి తక్కువగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రయోగాల్లో ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఎన్‌.గుమ్మడి సత్యనారాయణ, రణధీర్‌ రై కూడా పాల్గొన్నారు. చాలా సింపుల్ గా, తక్కువ వ్యయంతో తాగునీటిని శుద్ధి చేసే విధానం తీసుకురావాలన్నదే తమ లక్ష్యం అని రణధీర్ చెప్పారు. సురక్షితమైన తాగునీటిని తాగడం ద్వారా రోగాలకు దూరంగా ఉండొచ్చన్నారు. దీనిపై మరింత స్టడీ చేయాల్సి ఉందని సైంటిస్టులు వెల్లడించారు.

Read: బాదుడే బాదుడు : వరుసగా 13వ రోజు పెట్రో ధరల పెంపు