Corona Effect : కరోనా ఎఫెక్ట్..డిపోలకే పరిమితమైన బస్సులు..నష్టాల్లో ఆర్టీసీ

అసలే నష్టాలతో విలవిలాడుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. రోజురోజుకూ ఆక్యుపెన్షీ రేషియో తగ్గిపోతుండడంతో భవిష్యత్ పై సిబ్బందిలో ఆందోళన మొదలైంది.

Corona Effect : కరోనా ఎఫెక్ట్..డిపోలకే పరిమితమైన బస్సులు..నష్టాల్లో ఆర్టీసీ

Corona Effect

Corona effect on  RTC : అసలే నష్టాలతో విలవిలాడుతున్న తెలంగాణ ఆర్టీసీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఆర్టీసికి గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. రోజురోజుకూ ఆక్యుపెన్షీ రేషియో తగ్గిపోతుండడంతో భవిష్యత్ పై సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నైట్‌ కర్ఫ్యూ కారణంగా రాత్రి సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో ఆర్టీసీకి ఆర్ధిక పరంగా నష్టాలు మొదలయ్యాయి. రోజువారీ వచ్చే ఆదాయం కంటే రెట్టింపు వ్యయమవుతున్నట్లు గణంకాలు చూపుతున్నాయి.

తెలంగాణ ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. నష్టాల నుంచి బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఆర్టీసి మాత్రం లాభాల బాటలోకి రావడం లేదు. మరో వైపు కరోన వైరస్ వ్యాప్తి ఆర్టీసిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. లాక్‌డౌన్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమవగా… ప్రస్తుతం నడుస్తున్న బస్సుల వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోతోంది.

కరోన వైరస్ నేపధ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో… రాత్రి సర్వీసులన్నీ అధికారులు రద్దు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఓ మోస్తరు జనాలు కనిపిస్తుండగా రాత్రి 7 తర్వాత ప్రయాణికులు లేక బస్ స్టేషన్లు బోసిపోతున్నాయి.

కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం 10 ఆర్టీసీ డిపోలుండగా, 902 బస్సులు నిత్యం 2 లక్షల 12 వేల 330 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఈ సర్వీసుల ద్వారా రోజుకు కోటీ 20 లక్షల పైచిలుకు ఆదాయం ఆర్టీసీకి సమకూరేది. పూర్తిగా పడిపోయిన ఓఆర్ ఇప్పుడిపుడే పెరుగుతోంది. అధికారులు చేపట్టిన చర్యలతో 65 శాతానికి చేరింది.

దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్న క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. నిత్యం వందలాది మంది కోవిడ్ బారిన పడుతుండగా, మార్చి చివరి వారంలో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. ఇక అప్పటినుంచి ఓఆర్ 40 శాతానికి పడిపోయింది.

పరిస్థితులకు తగినట్లుగా ఆర్టీసీ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రీజియన్లో ఆర్టీసీ సంస్థకు 532 బస్సులుండగా, అద్దె బస్సులు 370 ఉన్నాయి. రోజు వచ్చే ఆధాయం 50లక్షలు అయితే ఖర్చు రెట్టింపు అవుతుందని అధికారులు చెప్తున్నారు. రద్దీ తగ్గిన కారణంగా కొన్ని సర్వీసులను రద్దు చేయగా… నైట్‌ కర్ఫ్యూ కారణంగా నైట్‌ సర్వీసులను ఆపేశారు.

కరోనా వైరస్‌ భయంతో ప్రయాణాలు చేసేందుకే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆక్యుపెన్సీ రేషియో మరింతగా పడిపోయే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే… సంస్థ మనుగడపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.