Corona Effect: ఏపీలో ఖైదీల విడుదల.. ఎవరెవరు బయటకొస్తారంటే?

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదులో పెద్దగా తేడాలు లేకపోయినా రికవరీలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

Corona Effect: ఏపీలో ఖైదీల విడుదల.. ఎవరెవరు బయటకొస్తారంటే?

Corona Effect

Corona Effect: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదులో పెద్దగా తేడాలు లేకపోయినా రికవరీలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కాస్త కరోనా తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తుండగా ఏపీలో మాత్రం ఇప్పటికీ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేని కరోనా జైళ్లలో ఖైదీలకు కూడా వ్యాపిస్తుంది. దీంతో జైళ్లలో ఖైదీలకు కరోనా కట్టడిపై సుప్రీం కోర్టు కల్పించుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏపీ హైకోర్టు మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్య బాగ్బీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్లశాఖడీజీ అహ్సన్ రాజాతో కూడిన కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటీవల సమావేశమై చర్చించి పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, కేసుల విచారణలో ఉన్న ఖైదీల విడుదలకు మార్గం సుగమం కానుంది.

వివిధ నేరాలలో ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష విధించే నేరాలకు పాల్పడిన విచారణ ఖైదీలను మధ్యంతర బెయిల్‌ద్వారా విడుదల చేయాలని నిర్ణయించింది. వారికి ప్రాథమికంగా 90 రోజుల మధ్యంతర బెయిల్‌మంజూరు చేయాలని సూచించింది. గతేడాది కరోనా కారణంగా హైపవర్ కమిటీ తీర్మానాలతో విడుదలైన ఖైదీలు, విచారణ ఖైదీలను ఈ సారీ కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష విధించేందుకు వీలున్న కేసుల్లో కూడా అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తప్పని సరిగా పాటించాలని తెలిపింది. ఈ ఖైదీలు కారాగారం నుంచి వెళ్లాక.. 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటామని విడుదల సమయంలో.. ఖైదీలు హామీ ఇవ్వాలని కమిటీ సూచించింది.

జస్టిస్ జోయ్ మల్య బాగ్బీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సూచించిన పలు తీర్మానాలను రాష్ట్రంలోని అన్ని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు డీజీపీ ఆదేశాలు ఇచ్చేలా హోంశాఖ ముఖ్య కార్యదర్శి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సుప్రీం ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలతోపాటు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. మధ్యంతర బెయిలుపై విడుదలయ్యే ఖైదీలు.. స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి.. జైళ్లశాఖ డిజీకి సూచించింది.