ఆక్సిజన్ అందక చెస్ట్ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల

ఆక్సిజన్ అందక చెస్ట్ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల

Corona Patient

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్ అందడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాకు ఆక్సిజన్ అందక చనిపోతున్నా డాడీ అంటూ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు వడ్లకొండ రవికుమార్(34) సెల్ఫీ వీడియోలో చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో కొన్ని వేల మంది కరోనా నుంచి కోలుకుంటుంటే, సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

ఆక్సిజన్ అందక కాదు, గుండె జబ్బుతో మరణించాడు:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితులను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. చెస్ట్ హాస్పిటల్ ఘటనపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు. అనేక హాస్పిటల్స్ కి తిరిగిన తరువాతే ఆ యువకుడు చెస్ట్ ఆసుపత్రికి వచ్చాడని చెప్పారు. అర్థరాత్రి సమయంలో వచ్చినా అతడిని చేర్చుకుని రాత్రంతా ఆక్సిజన్ ఇచ్చారని, కానీ అతడు గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. అతడికి ఆక్సిజన్ అందించ లేదనడం నిజం కాదన్నారు.

అసత్య ప్రచారాలతో వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర్ధరాత్రులు వచ్చిన వారికి కూడా చికిత్స అందిస్తున్నామన్నారు. వైద్య శాఖలో 258 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, చెస్ట్ ఆసుపత్రిలో హెడ్ నర్సు విక్టోరియా చనిపోయిందని మంత్రి చెప్పారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందిలో 36 మందికి కరోనా వచ్చిందన్నారు. హెల్త్ సెక్రటరీ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకిందన్నారు. అందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదన్నారు.

రేపటి నుంచి ఉచితంగా కరోనా టెస్టులు:
సీఎం చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నిచలేరని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 17వేల 81 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో 3వేల 500 ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉందన్నారు. మరో 6500 బెడ్స్ రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్ తో సిద్దం అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రం లో బెడ్స్ కి కొదవలేదని, అనవసరం గా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రైవేట్ లాబ్స్ లో కొన్నింటిలో 70-80 శాతం పాజిటివ్ కేసులు రావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. రేపటి(జూన్ 30,2020) నుండి జీహెచ్ఎంసీ పరిధిలో తిరిగి టెస్టులను ప్రారంభించనున్నట్టుగా మంత్రి తెలిపారు. అవసరమైన వారంతా ఆయా సెంటర్లలో శాంపిల్స్ ఇవ్వాలన్నారు.

‘‘ఊపిరాడ్తలేదంటే కూడా వినకుండా వెంటిలేటర్‌ బంద్‌ చేసిన్రు.. బతిమిలాడి సాల్‌సాల్‌ అయ్యింది (విసిగిపోయాను). ఇప్పటికే మూడు గంటలైంది డాడీ.. నాకు ఊపిరి ఆడ్తలేదు.. గుండె ఆగిపోయింది డాడీ.. బై డాడీ బై.. అందరికీ బై’’.. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో కరోనాతో చేరిన ఓ యువకుడు మరణయాతన పడుతూ చేసిన సెల్ఫీ వీడియోలో మాటలివి. ఈ వీడియో రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ హృదయవిదారక ఘటన అందరి గుండెలు పిండేసింది. అయ్యో పాపం అని అంతా కంటతడి పెట్టారు.

”ఊపిరాడ్తలేదు డాడీ..వెంటిలేటర్‌ బంద్‌ చేసిన్రు, గుండె ఆగిపోయింది డాడీ.. బై డాడీ బై.. అందరికీ బై’’..:
అర్ధరాత్రి వేళ శ్వాస అందక.. చివరి క్షణంలో తాను పడుతున్న బాధను కన్న తండ్రికి చెప్పాలన్న ఆరాటం.. తన బాధ అందరికీ తెలపాలన్న ఆవేదనతో రవికుమార్ పంపిన సెల్ఫీ వీడియో హృదయాలను కలచివేస్తోంది. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ఊపిరాడక పడిన నరకయాతన గురించి చెబుతూ సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. అది తండ్రికి చేరకముందే కన్నుమూశాడు. లోపం ఎక్కడ ఉన్నా చివరకు అతడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కన్నవారికి గర్భశోకం మిగిలింది. అతడి భార్య, పిల్లలను దిక్కులేని వారిని చేసింది.

11 కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగినా పట్టించుకోలేదు:
వడ్లకొండ రవికుమార్‌ (34) పదేళ్లపాటు సౌదీలో పనిచేశాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ తిరిగివచ్చి జవహర్‌నగర్‌ లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమార్తె (12), కుమారుడు (9) ఉన్నారు. కొద్దికాలంగా సొంతింటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. జూన్ 23న శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారింది. తండ్రి వెంకటేశ్వర్లును తోడు తీసుకుని రెండురోజులపాటు ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట ఇలా.. నగరంలోని 11 కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల వెంట తిరిగాడు. తన కొడుకును కాపాడమని ఆ తండ్రి వేడుకున్నా ఎక్కడా చేర్చుకోలేదు. ఎందుకైనా మంచిదని 24న సాయంత్రం ఓ ప్రైవేటు ల్యాబ్‌లో కరోనా పరీక్షకు నమూనాలిచ్చాడు. అదేరోజు రాత్రి ఇబ్బంది మరింతగా పెరగడంతో, తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి నిమ్స్‌కు వెళితే ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి వెళ్లమన్నారు. ఎట్టకేలకు రాత్రి 11.30 తర్వాత అక్కడ చేర్చుకుని వైద్యం ప్రారంభించారు. తోడుగా వచ్చిన తండ్రి ఆసుపత్రి ఆవరణలోనే ఉంటున్నాడు.

మృత్యువుతో పోరాడుతూ రవికుమార్‌ మరణం:
రవికుమార్‌ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌ అమర్చారు. 26వ తేదీ రాత్రి తనకు వెంటిలేటర్‌ తొలగించారని, ఊపిరి ఆడటం లేదని బతిమిలాడినా మళ్లీ పెట్టలేదంటూ రవికుమార్‌ అర్ధరాత్రి 12.30 సమయంలో ఊపిరాడక అనుభవిస్తున్న నరకాన్ని సెల్ఫీ వీడియో తీసి తండ్రి ఫోన్‌కు పంపాడు. వెంకటేశ్వర్లు 2.30 గంటలకు ఆ వీడియోను చూశాడు. వెంటనే రోదిస్తూ లోపలికి వెళ్లాడు. మృత్యువుతో పోరాడుతూ రవికుమార్‌.. శ్వాస అందక అప్పటికే కన్నుమూశాడు. దీంతో చెస్ట్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన చికిత్స ఇవ్వడం లేదని, కరోనా రోగులను వైద్య సిబ్బంది గాలికి వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చెస్ట్ ఆసుపత్రి డాక్టర్లు మాత్రం తమ చికిత్సలో ఎలాంటి లోపం కానీ నిర్లక్ష్యం కానీ లేవని చెప్పారు. వెంటిలేటర్ తొలిగించారు, ఆక్సిజన్ ఇవ్వలేదు అనేది అవాస్తవం అని వెల్లడించారు. గుండె జబ్బుతోనే రవికుమార్ చనిపోయాడని స్పష్టం చేశారు.

Read:వేల కోట్లు ఖర్చైనా ప్రజల ప్రాణాలు కాపాడతాం