హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తీసుకున్న 20రోజులకే కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తీసుకున్న 20రోజులకే కరోనా పాజిటివ్

Corona Vaccination: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న 20 రోజులకే మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్‌ వచ్చింది. నిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్‌, ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత వైరస్‌ ఏమీ చేయదనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యహరించడమే దీనికి కారణం అయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. మాస్క్‌ ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించకపోవడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోకపోవడమే కారణం అయి ఉండొచ్చు. అధికారులు మాత్రం ఈ అంశాన్ని గుట్టుగా ఉంచుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ తొలి విడత డోసేజ్ జనవరి 16న ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో పనిచేసే హెల్త్‌కేర్‌ వర్కర్లకు ముందుగా ఇచ్చారు. వాటిపై నమ్మకం లేకపోవడం, టీకా తీసుకున్న తర్వాత అలర్జీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండటంతో 50 శాతం లబ్ధిదారులు దూరంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి తొలి డోసు టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా ఇస్తారు.

అలా తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయి. అంటే 42 రోజుల తర్వాత మాత్రమే యాంటీబాడీస్‌ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతాయి. అప్పటివరకు కోవిడ్‌ నిబంధనలన్నీ పాటించాల్సిందేనని హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్ మెంట్ ముందు నుంచి చెప్తూనే ఉంది. చాలామంది దీనిని విస్మరించి.. విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.