Corona Second Wave: కరోనా కల్లోలం.. ఛిద్రమవుతున్న కుటుంబాలు!

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో సైతం మృత్యుఘంటికలు మ్రోగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఎప్పుడు ఎవరి నుండి ఏ వార్త వినాల్సివస్తుందోనని భయాందోళలను వ్యక్తమవుతున్నాయి.

Corona Second Wave: కరోనా కల్లోలం.. ఛిద్రమవుతున్న కుటుంబాలు!

Corona Second Wave

Corona Second Wave: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో సైతం మృత్యుఘంటికలు మ్రోగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఎప్పుడు ఎవరి నుండి ఏ వార్త వినాల్సివస్తుందోనని భయాందోళలను వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు మనతో నవ్వుతూ మాట్లాడిన మనిషి ఈరోజు ప్రాణాలతో లేడనే వార్తలు వినాల్సి రావడం తీవ్ర మనోవ్యధకు గురిచేస్తుంది. మనకి దగ్గరగా ఉండేవ్యక్తుల నుండి ఏ అర్ధరాత్రో ఫోన్ వస్తే తెలియకుండానే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అంతలా మహమ్మారి మనల్ని హడలెత్తిస్తోంది.

మహమ్మారి దెబ్బకు కుటుంబాలే అస్తవ్యస్తమవుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. తెలుగు రాష్ట్రాలలో రోజుకి వందల సంఖ్యలో మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతూ కుటుంబాలే కనుమరుగైపోతున్నాయి. కొన్నిచోట్ల ఇంట్లో చనిపోయిన వారి అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దంపతులు, కూతుళ్లు, కుమారులు, అత్తమామలు, సమీప బంధువులను ఈ రక్కసి బలి తీసుకుంటోంది. ఇంట్లో ఒకరికి వస్తే.. మిగిలిన వారు హడలిపోతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు పదిరోజుల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. నెల్లూరు జిల్లా కావలిలో తండ్రీతనయులు ఒకేరోజు చనిపోయారు. విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అయిదురోజుల వ్యవధిలో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు మరికొన్ని కుటుంబాలు ఆర్థికంగా రోడ్డునపడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్సకు లక్ష నుండి పదిలక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు.

ముందు ఒక్కరే కదా అని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులకు తోడుగా అదే కుటుంబంలో ఒక్కొక్కరు కోవిడ్ బారినపడి చివరికి జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు, ఆస్తులు అమ్ముకొని ఆసుపత్రులకు కట్టాల్సి వస్తుంది. దీనికితోడు చివరికి కరోనాను జయించి ప్రాణాలతో తిరిగి వస్తాడన్న గ్యారంటీ ఉండడం లేదు. మరణిస్తే డెడ్ బాడీ కూడా ఇంటికి వస్తుందా.. కనీసం చివరి చూపు దక్కుతుందా అనుకుంటూ కుమిలిపోతున్నారు. మహమ్మారి అన్ని విధాలుగా ప్రజల పాలిట శాపమై జీవితాలను తల్లక్రిందులు చేస్తుంది.