Corona Second Wave: భారత్‌లో ఉత్పత్తిని ఆపేస్తున్న ‘హీరో’ మోటో కార్ప్!

వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొస్తూ కరోనా కరాళ నృత్యాన్ని కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభణ హడలెత్తిస్తుండగా ఆయా దేశాలు కొన్ని మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.

Corona Second Wave: భారత్‌లో ఉత్పత్తిని ఆపేస్తున్న ‘హీరో’ మోటో కార్ప్!

Corona Second Wave

Corona Second Wave: వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొస్తూ కరోనా కరాళ నృత్యాన్ని కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభణ హడలెత్తిస్తుండగా ఆయా దేశాలు కొన్ని మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా రాష్ట్రాలలో తీవ్రతను బట్టి ఆంక్షలు అమలు జరుగుతుండగా ఢిల్లీలో పూర్తిస్థాయి లాక్ డౌన్ కూడా అమల్లో ఉంది. కాగా, గత ఏడాది ఈ సమయానికి పూర్తిస్థాయి కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమల్లో ఉంది. ఒక్క మెడికల్ రంగం తప్ప మిగతా ఏ రంగం కూడా ఉత్పత్తి జరగలేదు. కానీ ఈ ఏడాది అంతటి కఠిన ఆంక్షలు విధించలేదు.

అయితే.. పలు రంగాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని నిలిపివేయగా భారత దిగ్గజ మోటార్స్ కంపెనీ హీరో కూడా ఇప్పుడు తమ ఉత్పత్తిని ఆపేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే హీరో సంస్థ త‌మ కార్పొరేట్ ఆఫీస్‌ల ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లుగా నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలోని గ్లోబ‌ల్ పార్ట్స్ సెంట‌ర్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని మ్యానుఫ్యాక్చ‌రింగ్ కేంద్రాల్లో త‌యారీని నిలిపేస్తున్న‌ట్లు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ నెల 22 నుంచి మే 1 మ‌ధ్య మొత్తం నాలుగు రోజుల పాటు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆయా ప్లాంట్లు మూత‌ప‌డ‌తాయ‌ని ప్రకటనలో తెలిపింది. ఈ ష‌ట్‌-డౌన్ స‌మ‌యాన్ని ఆయా కేంద్రాల్లో అవ‌స‌ర‌మైన నిర్వ‌హ‌ణ ప‌నుల కోసం వినియోగించ‌నున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. కాగా.. ఇప్పుడు ఉత్ప‌త్తిని నిలిపేసినా.. డిమాండ్‌కు త‌గిన‌ట్లుగా ఈ త్రైమాసికం మిగ‌తా నెల‌ల్లో ఉత్ప‌త్తిని పెంచుతామ‌ని తెలిపింది.