తెలంగాణలో కరోనా : జియాగూడలో వైరస్ ఎలా సోకిందంటే

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 04:10 AM IST
తెలంగాణలో కరోనా : జియాగూడలో వైరస్ ఎలా సోకిందంటే

హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గడం లేదు. 2020, మే 11వ తేదీ సోమవారం నమోదైన కేసులన్నీ GHMC పరిధిలోనే ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని జియాగూడ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి.

సోమవారం జియగూడ డివిజన్‌ పరిధిలో 26 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ డివిజన్‌లో కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యుల నుంచి రక్త నామునాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

జియాగూడ డివిజన్‌ పరిధిలోని దుర్గానగర్‌ ప్రాంతంలో ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఆ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంకటేశ్వరనగర్‌లో కూడా గత కోన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఆమె కూతురు, తోటి కోడలికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే ప్రాంతంలోని రిటైర్డ్‌ ఎంప్లాయ్‌ కరోనా పాజిటివ్‌తో ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో అతడి  కూతురు, కోడలు, పక్కింట్లో ఉన్న మరో యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. సబ్జీమండి ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని కుమారునికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందిరానగర్‌లోని ఓ మహిళకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో.. ఆమె కుమారునికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 

జియగూడ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు చనిపోయారు.  మరో తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.  జియాగూడలో ఎక్కువ కేసులు నమోదుకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రాంతాలలో దుకాణాలను మూసి వేసి జన సంచారం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కరోనాకు కట్టడి  చేయాల్సిన అవసరం ఉందని ప్రజలలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. 

ఇదిలా ఉంటే…తెలంగాణలో 2020, మే 11వ తేదీ సోమవారం కొత్తగా 79మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక విధానాలతో కరనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ…. మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిర్ధారణ అయిన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1,275కు చేరింది.

కరోనా కాటుకు 30మంది చనిపోగా… తెలంగాణలో 801 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 444 మంది ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజే 50మంది డిశ్చార్జి అవగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వారు 42 మంది ఉన్నారు. సూర్యాపేటకు చెందిన వారు నలుగురు ఉండగా… నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.

Read More:

ఏపీ ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ అభ్యంతరం

హైదరాబాద్ లో 24 గంటల్లో 79 కరోనా కేసులు…తెలంగాణలో 1275కి పెరిగిన సంఖ్య