Corona Telugu States: ఏపీలో 20 శాతం దాటిన పాజిటివిటీ.. ఇంటింటి సర్వే ఏం చెప్తుంది?

కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి.

Corona Telugu States: ఏపీలో 20 శాతం దాటిన పాజిటివిటీ.. ఇంటింటి సర్వే ఏం చెప్తుంది?

Corona Telugu States Positivity Exceeds 20 In Ap What Does A House Survey Say In Ts

Corona Telugu States: కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి. మహమ్మారి కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ.. ఇప్పటికిప్పుడు అవి ఎంతవరకు ఫలితమిస్తాయన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ముఖ్యంగా ఏపీలో వైరస్ వ్యాప్తి ఉదృతంగా కనిపిస్తుంది. ఇక్కడి పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది. కానీ ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ ఇరవై శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలనీ ఐసీఎంఆర్ సూచిస్తుంది.

మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం 9 శాతం పాజిటివిటీ రేటు ఉండగా ఇది పది శాతం దాటేందుకు పెద్ద సమయం పట్టదు. పరీక్షలు, ఇప్పటికే కోవిడ్ నిర్ధారణైన రోగులు, ప్రభుత్వం లెక్కలోకి రాకుండా ప్రైవేట్ పరీక్షా కేంద్రాలలో టెస్టులు చేయించుకొని హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు కాకుండా ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో మరో లక్షన్నర మందికి పైగా కోవిడ్ లక్షణాలు ఉన్నవారిగా ప్రజలను గుర్తించారు. వీరందరినీ కోవిడ్ రోగులుగా నిర్ధారించలేం కానీ వీరిలో కరోనా రోగులుంటే మాత్రం వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ఇంటింటి సర్వేలో లక్షణాలు నమోదు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఇంటికే కరోనా కిట్లను పంపిణీ చేస్తుంది. అయితే, తెలంగాణలో కూడా ఇప్పటికిప్పుడు వైరస్ కట్టడి అయ్యే అవకాశం తక్కువే కనుక ఇక్కడ కూడా మరికొన్నాళ్లు కఠిన ఆంక్షలు విధించాల్సిందేనని నిపుణుల అభిప్రాయం. మరోవైపు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడితో పాటు ఇదే సమయంలో ఆసుపత్రులలో వసతులను పెంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే మారణకాండను అదుపు చేయడం కష్టమవుతుంది.