ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు, రాత్రిలోపు ఫలితాలు, రిపోర్టుపై ఉత్కంఠ

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 05:53 AM IST
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పరీక్షలు, రాత్రిలోపు ఫలితాలు, రిపోర్టుపై ఉత్కంఠ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ముందుజాగ్రత్తగా ఆయనకు కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇవాళ(జూన్ 9,2020) కేజ్రీవాల్ కు కరోనా నిర్ణారణ పరీక్షలు చేశారు. డాక్టర్లు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ కి పంపారు. రాత్రి లోపు ఫలితాలు వస్తాయని తెలుస్తోంది. రిపోర్టులో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

జ్వరం, గొంతునొప్పి, దగ్గుతో బాధపడుతున్న సీఎం:
సోమవారం(జూన్ 8,2020) అస్వస్థతకు గురవడంతో సీఎం కేజ్రీవాల్ సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆదివారం(జూన్ 7,200) ఉదయం కేజ్రీవాల్ తన అధికారిక నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మంత్రులు గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్, ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ హాజరయ్యారు. ఏకంగా రాష్ట్ర సీఎం కరోనా లక్షణాలతో బాధపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మన దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 28వేల 936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

24 గంటల్లో 9వేల987 కరోనా కేసులు, 331మరణాలు:
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. వారం రోజులుగా దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో 9వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 9వేల 987 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్-19 మహమ్మారికి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మరణించారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం(జూన్ 9,2020) ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,66,598కి చేరింది. ఇప్పటివరకు 7వేల 466మంది కరోనాతో చనిపోయారు. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకున్నారు. మరో 1,29,917 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసుల్లో 5వ స్థానం, మరణాల్లో 12వ స్థానం:
లాక్ డౌన్ లో నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా తీవ్రత పెరిగింది. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 67వేల పాజిటివ్ కేసులు నమోదుకావడంతోపాటు 1868 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్ 5వస్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో 12వ స్థానంలో కొనసాగుతోంది. 

Read: కరోనా నుంచి కోలుకుంటున్న భారత్.. 24గంటల్లో 9,987కేసులు