కరోనావైరస్‌లో మార్పు వచ్చిందా? వచ్చే వ్యాక్సిన్లు పనిచేస్తాయా? సైంటిస్టులు ఏమంటున్నారు?

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 01:47 AM IST
కరోనావైరస్‌లో మార్పు వచ్చిందా? వచ్చే వ్యాక్సిన్లు పనిచేస్తాయా? సైంటిస్టులు ఏమంటున్నారు?

భారతదేశంలో విస్తరిస్తోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (mutate)జరుగుతోందా లేదా అధ్యయనం చేసేందుకు దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) భావిస్తోంది. SARS‌–కోవిడ్‌2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఆ మార్పు ఏంటో గుర్తించడం ద్వారా దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి వీలు అవుతుందని సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు.

ఈ అధ్యయనం ద్వారా వైరస్‌ ధృడంగా వృద్ధిచెందుతోందా? త్వరగా వ్యాప్తిచెందుతోందా అనేది గుర్తించవచ్చు. కరోనా వైరస్‌ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనా వేసేందుకు కోవిడ్‌–19 బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్ష చేస్తారు. మిగతా దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా(GISAD)ని బట్టి తెలుస్తోందని మరో శాస్త్రవేత్త చెప్పారు. 

ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్‌లోకి వివిధ రకాల కరోనా వైరస్‌లు వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం మూడు రకాలైన వైరస్‌లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఒకటి వూహాన్‌ నుంచి వచ్చింది. మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్‌ ఇరాన్‌ నుంచి వచ్చిన రకమన్నారు. అయితే ఇరాన్‌ నుంచి వచ్చిన వైరస్‌ మాత్రం చైనా వైరస్‌ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్‌ ప్రధాన లక్షణాలను కనిపెట్టేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అంటున్నారు. అన్నిరకాల వైరస్‌లలో ఒకేరకం ఎంజైములు ఉండడం వల్ల వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

భారత్‌లో ఈ వైరస్‌ 3 నెలలుగా ఉన్నప్పటికీ  త్వరగా మార్పులకు గురికాలేదనీ ICMRలోని ఎపిడెమాలజీ అండ్‌ కమ్యూని కబుల్‌ డిసీజెస్‌ హెడ్‌ డాక్టర్‌ రమణ, ఆర్‌.గంగాఖేద్కర్‌ తెలిపారు. ప్రాణాంతక వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు 6 భారతీయ కంపెనీలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 70 వాక్సిన్‌లు పరీక్షించారు. ఇందులో 3 మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరాయి.

2021 కంటే ముందు వ్యాక్సిన్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు సైంటిస్టుల ప్రకారం.. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందబాటులోకి రావడానికి 12 నుంచి 18 నెలల పడుతుందని అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు దేశంలో కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరం, క్వారంటైన్ వంటి చర్యలతోనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.