Coronavirus Second wave: ఆందోళనలో ఇండియన్ సినిమా!

కంటికి కూడా కనిపించని కొత్త కరోనా వైరస్ ప్రపంచాన్నే గగగడలాడించింది. ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తుండగానే వదల బొమ్మాళీ అంటూ మరోమారు దాడికి సిద్ధమైంది. దీంతో పలు రంగాలలో టెన్షన్ మొదలైంది. అందులో ఇండియన్ సినిమా కూడా ఒకటి.

Coronavirus Second wave: ఆందోళనలో ఇండియన్ సినిమా!

Coronavirus Second Wave

Coronavirus Second wave: కంటికి కూడా కనిపించని కొత్త కరోనా వైరస్ ప్రపంచాన్నే గగగడలాడించింది. ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. కోవిడ్ మహమ్మారి భూగోళం మీద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ రంగం ఆ రంగం అని లేకుండా సమస్త మానవాళిని ముప్పతిప్పలు పెట్టేసింది. దాదాపు ఏడాది కాలంగా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తుండగానే వదల బొమ్మాళీ అంటూ మరోమారు దాడికి సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాలలో వైరస్ విజృంభణ కొనసాగుతుండగా మన దేశంలో కూడా పలు రాష్ట్రాలలో వ్యాప్తి మొదలైంది. వ్యాప్తిని అరికట్టేందుకు పలు రాష్టాలలో ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో పలు రంగాలలో టెన్షన్ మొదలైంది. అందులో ఇండియన్ సినిమా కూడా ఒకటి.

భారతీయ సినీ పరిశ్రమ దాదాపు తొమ్మిది నెలల పాటు ప్యాకప్ చెప్పేసుకోగా గత మూడు నెలల నుండే మళ్ళీ తమ తమ కార్యకలాపాలను మొదలు పెట్టింది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు గత ఏడాదిగా ఆగిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తుండగా క్రేజీ ప్రాజెక్ట్స్ సైతం ముమ్మర షూటింగ్ మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు మహమ్మారి సెకండ్ వేవ్ మొదలుపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలతో ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ లో టెన్షన్ మొదలైంది. వందల కోట్లతో ఖర్చుతో తెరకెక్కే భారీ ప్రాజెక్టులకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా ఎఫెక్ట్ ఈ భారీ ప్రాజెక్టులపై అధికంగా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా.

ఎందుకంటే.. భారీ ప్రాజెక్ట్స్, పాన్ ఇండియా సినిమాలు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంటాయి. ఇప్పుడు పలు దేశాలతో పాటు మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఆంక్షలు మొదలయ్యాయి. పలు నగరాలలో థియేటర్స్ మళ్ళీ మూతపడుతుండగా ఒకవేళ థియేటర్స్ ఉన్నా సెకండ్ వేవ్ దెబ్బతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లడం గగనమే అవుతుంది. దీంతో మేకర్స్ ముందు జాగ్రత్తగా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ జాబితాలో తెలుగు సినిమాలు సైతం ఉన్నాయి.

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన రానా న‌టించిన అర‌ణ్య సినిమా సౌత్ లో విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా హిందీ వ‌ర్షెన్ వాయిదా ప‌డింది. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు నార్త్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దెబ్బ అరణ్య సినిమా మీద పడింది. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతమవుతున్న క్రమంలో రానున్న సినిమాల భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వచ్చే రెండు నెలలు చిన్నా, చితకా సినిమాలతో పాటు జులై నుండి పాన్ ఇండియా సినిమాల విడుదల హవా మొదలు కానుంది. ఇందులో కేజేఎఫ్-2, ప్రభాస్ రాధేశ్యాం, అల్లు అర్జున్ పుష్ప, పూరి-విజయ్ లైగర్ తో పాటు ఇండియన్ బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ వరస పెట్టనున్నాయి. రానున్న మూడు, నాలుగు నెలల్లో వైరస్ ఉదృతి పెరగకుండా తగ్గితే తప్ప ఈ సినిమాలకు ఫ్రీడమ్ దొరికే ఛాన్స్ ఉండదు. మరి ఈ మహమ్మారి అదుపులోకి వస్తుందా? అన్నదే చూడాలి.