తెలంగాణలో కరోనా భయం : సొంతంగా లాక్ డౌన్ అమలు

  • Published By: madhu ,Published On : June 21, 2020 / 02:52 AM IST
తెలంగాణలో కరోనా భయం : సొంతంగా లాక్ డౌన్ అమలు

కరోనా భయపెడుతోంది. చైనా నుంచి ఈ దిక్కుమాలిన వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. భారతదేశాన్ని కుమ్మేస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తొలుత లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

కానీ ఆర్థికంగా నష్టాలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరిగినా..అది సాధ్యం కాదని తేలిపోయింది. ఈ తరుణంలో..స్వీయ నియంత్రణే శరణ్యమని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలు తమంతట తమే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మొన్న భిక్కనూరు, నిన్న గంభీరావు పేట, నేడు ఇబ్రహీంపట్నం. ఇలా లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నారు.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో కేసులు పెరిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇతర గ్రామాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే స్వీయ కట్టడి మేలని గ్రామ పంచాయతీలు భావించాయి. అందులో భాగంగా తీర్మానాలు చేస్తూ..లాక్ డౌన్ ను పకడ్బందిగా అమలు చేస్తున్నాయి.  

మాచారెడ్డి, కామారెడ్డి, మెదక్‌ సహా పలుచోట్ల సగం పూట వరకే కార్యకలాపాలు సాగిస్తూ.. మిగతా వేళల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లో మాస్కులు ధరించని వారికి కూడా జరిమానాలు విధిస్తూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తుండడంతో పోలీసులు సహయ సహకారాలు అందిస్తున్నారు.

మొత్తానికి పలు గ్రామాల్లో స్వచ్చదంగా లాక్ డౌన్ అమలు చేస్తూ..కరోనా వైరస్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Read: corona virus : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధనలివే