ఉద్యోగం వ‌చ్చింద‌ని స్వీట్లు పంచారు..అద్దెకుండే ఇంటితో పాటు 8 ఇళ్లను దోచేసిన జంట

ఉద్యోగం వ‌చ్చింద‌ని స్వీట్లు పంచారు..అద్దెకుండే ఇంటితో పాటు 8 ఇళ్లను దోచేసిన జంట

couple robberies in odisha : దోపీడీలు చేయాలనే ఆలోచన ఉండాలే గానీ ఎన్ని రకాలుగా అయినా దోచేయొచ్చు. కొత్త కొత్త ఆలోచనలతో కిలాడీ భలే దోపిడీలు చేస్తున్నారు. అటువంటి ఓ జంట ఓ ఇంటిలో అద్దెకు దిగి..ఉద్యోగం వచ్చిందాంటీ..ఇందా ఈ స్వీటు తీసుకోండి అంటూ మత్తు కలిపిన మిఠాయిలు పంచిపెట్టి మరీ దోచేసిన ఘటనతో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధి అంతా తెల్లముఖం వేసింది. ఇంటి యజమానితో ఇంటిలో ఏకంగా రూ.35 లక్షలు విలువ చేసే బంగారాన్ని దోచేసి ఎస్కేప్ అయ్యిందో కిలాడీల జంట..అద్దెకు ఉంటున్న యజమాని ఇంటితో సహా ఆ వీధిలోని మరో ఏడు ఇళ్లను కూడా దోచేశారు. ఆ తరువాత చక్కగా మాయం అయిపోయారు..

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధిలో నివ‌సించే ఉషా పటేల్ అనే మ‌హిళ ఇంట్లో సుభాష్‌ (అని పేరుతో ఇంటిలో అద్దెకు) దంప‌తులు గత మూడు నెల‌ల క్రితం అద్దెకు ఉంటున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఉషా పటేల్ ‘ మీరు ఏం చేస్తుంటారు? అని ప్రశ్నించగా..ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని సుభాష్ చెప్పుకొచ్చాడు. అలా పక్కా ప్లాన్ తో ఇంట్లో అద్దెకు దిగారు. మూడు నెలలు గడిచాక గత రెండు రోజుల క్రితం సాయంత్రం బ‌య‌ట‌కు వెళ్లి..స్వీటు ప్యాకెట్స్ తో ఇంటికి వచ్చాడు.

తరువాత చక్కగా తయారైన సుభాష్ ‘‘నాకు మంచి ఉద్యోగం వచ్చిందని ఇంటి యజమాని ఉషా పటేల్ కు స్వీట్లు ఇచ్చాడు. దానికి ఆమె కంగ్రాట్స్ చెప్పింది. థాంక్యూ అని చెప్పి ఆమెతో పాటు ఆ వీధిలోని మరికొన్ని ఇళ్లకు వెళ్లి స్వీట్లు ఇచ్చాడు. ఆ స్వీట్స్ లో మ‌త్తు మందు క‌లిపాడని వాళ్లకు మాత్రం ఏం తెలుసు? అది తెలియక అందరూ సుభాష్ పంచిన స్వీట్లు తిన్నారు.

అలా స్వీట్లు తిన్న వారంతా మత్తులోకి జారుకోవ‌డంతో అప్పటికే సిద్ధంగా ఉన్న సుభాష్ రాత్రి 10 గంటలకు త‌న‌ భార్యతో కలిసి యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారాన్ని కొంత రూ.2.5 లక్షల నగదుని బ్యాగులో సర్దేశాడు. ఆ తరువాత తాపీగా తాను స్వీట్లు పంచిన ఇళ్లకు వెళ్లి.. ఏడు ఇళ్ల‌లోనూ చోరీ చేసి భార్య‌తో కలసి చక్కగా పారిపోయాడు.

అలా సుభాష్ ఇచ్చిన స్వీట్లు తిన్నవారు మరునాడు ఉదయం వరకూ మత్తులో నుంచి తేరుకోలేకపోయారు. అలా ఇంటి యజమాని ఉషా పటేల్ మ‌త్తు వ‌దిలాక..లేచి చూసేసరికి ఇంకేముంది? ఇల్లంతా దోపిడీ జరిగింది. అది తెలుసుకున్న ఉషా పటేల్ లబోదిబోమంది. తన ఇంటితో పాటు మరో ఏడు ఇళ్లలో దోపిడీ జరిగిందని తెలుసుకుని అందరూ కలిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు కిలాడీలో కోసం గాలింపు ప్రారంభించారు. అసలు వారిద్దరూ దంపతులేనా? లేక దోపిడీలు చేయటానికి ఇలా భార్యాభర్తలుగా ఇళ్లలో అద్దెకు తీసుకుని దోపిడీలు చేస్తున్నారా? అని దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు ప్రారంభించారు.