భారత్ పై కరోనా ఎఫెక్ట్.. 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు, 12కోట్ల మంది పేదరికంలోకి

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.

  • Published By: naveen ,Published On : May 18, 2020 / 07:01 AM IST
భారత్ పై కరోనా ఎఫెక్ట్.. 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు, 12కోట్ల మంది పేదరికంలోకి

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. లక్షల మందిని మంచాన పడేసింది. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టనపెట్టుకుందో తెలియదు. కరోనా.. మనుషుల ప్రాణాలపైనే కాదు ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్రమైన ప్రభావమే చూపింది. కరోనా దెబ్బకు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి. భవిష్యత్తులో భయానక పరిస్థితులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు నిరుద్యోగం, అటు పేదరికం పెరిగిపోనున్నాయి. మన దేశంలోనూ కరోనా ఎఫెక్ట్ తీవ్రంగానే ఉండనుంది. 13.5కోట్ల ఉద్యోగాలకు ముప్పు ఉంది. 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకోనున్నారు.

ఉద్యోగాలు కోల్పోనున్న 13.5 కోట్ల మంది:
కరోనా ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం కారణంగా… భారత్‌లో 135 మిలియన్ల (13.5 కోట్లు) మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని  అంతర్జాతీయ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోని జారుకుంటారని ఆ సంస్థ తెలిపింది. భారత్‌లో కోవిడ్-19 ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఆర్థర్‌ డి.లిటిల్‌ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. ‘భారత్‌- కోవిడ్‌-19తో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం, కొవిడ్‌-19 అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, బలోపేతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’ పేరుతో ఈ నివేదిక రూపొందించిన ఆర్డర్ డి.లిటిల్ అనేక అంశాలను ప్రస్తావించింది.

తగ్గనున్న వ్యయాలు, పొదుపు:
మొత్తం 13.5 కోట్ల మంది ఉపాధి కోల్పోవడంతో వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని.. దీని వల్ల వ్యయాలు, పొదుపు తగ్గిపోతాయని నివేదిక తెలిపింది. అంతేకాదు, తలసరి ఆదాయం క్షీణించడంతోపాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కూడా పడిపోతుందని వ్యాఖ్యానించింది. ‘క్రమంగా భారత్‌లో పెరుగుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు చూస్తోంటే, రికవరీ ‘డబ్ల్యూ’ ఆకారంలో వచ్చే అవకాశం ఉంది. దీంతో దేశ జీడీపీ 2020-21లో 10.8 శాతం మేర కుంచించుకు పోయి 2021-22లో కేవలం 0.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చ’ని నివేదిక అంచనా వేసింది.

35శాతానికి చేరనున్న నిరుద్యోగ రేటు, 4కోట్ల మంది నిరుపేదలు:
‘అంచనా వేసిన జీడీపీ మందగమనం తాలూకూ నష్టంతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 35 శాతానికి చేరొచ్చు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా మొత్తం 17.4 కోట్ల మంది నిరుద్యోగులు తయారవుతారు. ఈ ప్రభావంతో 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారు. అందులో 4 కోట్ల మంది నిరుపేదలుగా మారతార’ని నివేదిక తెలిపింది.

దేశంలో 96వేలు దాటిన కరోనా కేసులు, 3వేలు దాటిన మరణాలు:
భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 5వేల చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5వేల 242 పాజిటివ్ కేసులు, 157మరణాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో సోమవారం(మే 18,2020) నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96వేల 169కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3029 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36వేల 824 మంది కోలుకోగా మరో 56వేల 316 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్రలో ఒక్కరోజే 2వేల 347 కరోనా కేసులు:
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులో ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 65వేల కేసులు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో ఒక్కో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. కరోనా మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న(మే 17,2020) ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 2వేల 347 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33వేల 53కి చేరింది. ఇక ఈ వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 63మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1198కి చేరింది.

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం:
తమిళనాడులో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 639మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 11వేల 224కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 78మంది ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే 721పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ బారినపడిన వారిసంఖ్య 10వేల 054కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 160మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న 421 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవడంతో మొత్తం కేసుల సంఖ్య 11వేల 379కి చేరింది. వీరిలో 659మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 4977 మందికి కరోనా సోకగా 248మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ లో 2677 కేసులు నమోదు కాగా 238మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్ లో 5202 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా వీరిలో 131మంది మరణించారు.

ఏపీ, తెలంగాణలోనూ కరోనా విజృంభణ:
తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్ 19 తీవ్రత కొనసాగుతోంది. ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య 2వేల 282కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 50మంది చనిపోయారు. ఇక తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1551కి చేరగా ఇప్పటివరకు 34మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Here>> ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్… ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం