కరోనాకి మందు కనిపెట్టేశాం, 5 రోజుల్లో పూర్తిగా నయం, పతంజలి బాలక్రిష్ణ కీలక ప్రకటన

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది.

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 06:45 AM IST
కరోనాకి మందు కనిపెట్టేశాం, 5 రోజుల్లో పూర్తిగా నయం, పతంజలి బాలక్రిష్ణ కీలక ప్రకటన

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది.

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలీదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారి ముప్పు తప్పదని నిపుణులు తేల్చారు. దీంతో సమస్త మానవాళి వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని, ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి ప్రస్తుతానికి అదొక్కటే మార్గం.

ఆయుర్వేదంతో కరోనా నయం:
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. యావత్ ప్రపంచం ప్రాణభయతో బతుకున్న ఈ పరిస్థితుల్లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. కరోనాను ఆయుర్వేదంతో పూర్తిగా నయం చేయవచ్చని ఆయన ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా ఫలితాలు రాబట్టేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని నియమించామని, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. చాలామంది కరోనా పాజిటివ్ పేషంట్లకు క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా చికిత్స చేశామని, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని పతంజలి సీఈవో ప్రకటించారు. తమ మెడిసిన్ వాడితే 5 నుంచి 14 రోజుల్లో కరోనా నెగిటివ్ వస్తుందని బాలకృష్ణ చెప్పారు.

వారం రోజుల్లో సాక్ష్యాలు, ఆధారాలతో వెల్లడి:
”కోవిడ్ 19 వ్యాప్తి మొద‌ల‌య్యాక మేం ఓ సైంటిస్టు బృందాన్ని ఏర్పాటు చేశాం. వారు ముందుగా క‌రోనాపై పోరాడే ప‌లు ఆయుర్వేద స‌మ్మేళ‌నాల‌ను గుర్తించారు. వాటితో వంద‌ల‌మంది క‌రోనా పాజిటివ్ పేషెంట్ల‌కు చికిత్స అందించాం. ఆ అధ్య‌య‌నాల్లో 100 శాతం అనుకూల‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి..” అని బాల‌కృష్ణ మీడియాకు తెలిపారు. ప్ర‌స్తుతం ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ మ‌రిన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను చేప‌ట్టింద‌ని, మ‌రో వారం రోజుల్లో తాము ఈ విషయాల‌ను రుజువు చేసే సాక్ష్యాలు, ఆధారాల‌ను బ‌య‌ట పెడ‌తామ‌ని ఆయన వెల్లడించారు.

మా మెడిసిన్ వాడాక 5 నుంచి 14 రోజుల్లో కరోనా నెగిటివ్:
”మా కంపెనీ ఔష‌ధం తీసుకున్నాక కోవిడ్ 19 పేషెంట్లు 5 నుంచి 14 రోజుల్లోగా పూర్తిగా కోలుకున్నారు. వారంద‌రికీ కరోనా నెగెటివ్ వ‌చ్చింది. క‌నుక‌, ఆయుర్వేదం క‌రోనాను న‌యం చేస్తుంద‌ని మేం చెప్ప‌గ‌లం. ప్ర‌స్తుతం నియంత్రిత ప‌ద్ధ‌తిలో అధ్య‌య‌నాలు చేస్తున్నాం. మ‌రో 4, 5 రోజుల్లో మా దగ్గరున్న సాక్ష్యాల‌ను, ఇత‌ర స‌మాచారాన్ని ప్ర‌పంచానికి విడుద‌ల చేస్తాం” అని బాల‌కృష్ణ తెలిపారు. దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ పతంజలి సీఈవో చేసిన ప్ర‌క‌ట‌న సంచలనంగా మారింది. అందరిలో ఆశలు చిగురింపజేసింది. ఆ ఆయుర్వేద ఔష‌ధ‌మే కనుక క‌రోనాను న‌యం చేయ‌గ‌లిగితే నిజంగా మ‌నం ప్ర‌పంచంలోనే ఓ అద్భుత‌మైన‌ ఘ‌న‌త సాధించిన‌ట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దేశంలో 9వేలు దాటిన కరోనా మరణాలు:
భారత్‌లో కరోనా వైరస్‌ తో చనిపోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 300లకుపైగా కొవిడ్‌-19 మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 311 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మరణించినవారి సంఖ్య 9195కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదివేలకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆదివారం(జూన్ 14,2020) ఉదయానికి దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 3,20,922కు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా మరో 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త రిలీఫ్ ఇస్తోంది.

ప్రపంచంలో కరోనా కేసుల్లో 4వ స్థానం, మరణాల్లో 9వ స్థానం:
ఇదిలాఉంటే, కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలో 9వ స్థానంలో కొనసాగుతోంది. 9650 మరణాలతో బెల్జియం 8వ స్థానంలో ఉండగా, 8867 మరణాలతో జర్మనీ 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.