కోవిడ్-19 వ్యాక్సినేషన్ గ్రాండ్ సక్సెస్ : టీకా ఎంత మందికి వేశారు ? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా ?

కోవిడ్-19 వ్యాక్సినేషన్ గ్రాండ్ సక్సెస్ : టీకా ఎంత మందికి వేశారు ? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా ?

Covid Vaccination Highlights : ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ.. తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి మొదటి రోజు ఎంత మంది టీకా వేయించుకున్నారు..? వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వచ్చాయా..? దేశవ్యాప్తంగా తొలి రోజు లక్షా 91వేల 181 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని తెలిపింది కేంద్రం. శనివారం 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16వేల 755 మంది సిబ్బంది పాల్గొన్నారు. అయితే, కొవిన్‌ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఆలస్యమైంది. మొదటి రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.

మోడీ స్పీచ్ అనంతరం : –
ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అందించారు అధికారులు. విపత్తు కాలంలో వారు అందించిన సేవలు వెలకట్టలేనివనీ, అందుకే మొదటగా వారికే కొవిడ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపిన కేంద్రం.. వారితోనే వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో.. హెల్త్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకాను తీసుకోవడం మొదలు పెట్టారు. తెలంగాణలో మొత్తం 140 కేంద్రాల్లో 3,653 మందికి టీకాను వేశారు అధికారులు. ఏపీలో 332 కేంద్రాల్లో 18,412 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

మహారాష్ట్రలో నిలిచిన ప్రక్రియ: –
మహారాష్ట్రలో కోవిన్ యాప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డంకి ఏర్పడింది. మహారాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు తెలిపింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ. సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను పున:ప్రారంభిస్తామని వెల్లడించింది.  టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం కూడా ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు వెల్లడించింది.

సైడ్ ఎఫెక్ట్స్ : –
మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమీక్షించారు. కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంతో ఉపశమనం లభించినట్లైందని తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా దేశం ముందు నిలిచాయని తెలిపారాయన. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఒక్కరికి కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. టీకాను తీసుకుని ఆస్పత్రి పాలయిన వారు లేరని తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా మొదటి రోజు ముగిసిందని తెలిపింది. త్వరలోనే మరింత మందికి కరోనా టీకాను అందిస్తామని వివరించింది.