Curfew Effect : సినీ రంగంపై నైట్ కర్ఫ్యూ ప్రభావం

Curfew Effect : సినీ రంగంపై నైట్ కర్ఫ్యూ ప్రభావం

Night Curfew Effect

Curfew Effect on Cine Industry : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా మామూలు థియేటర్లలో షోల సంఖ్య తగ్గించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో… రోజూ మూడు షోలు వేసేందుకు థియేటర్ల యాజమాన్యాలు కసరత్తు చేశాయి. ఇప్పటికే ఫస్ట్ షోనూ ఐదు గంటలకు స్టార్ట్ చేశారు. అంటే 8 గంటలకు ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తారు.

మరోవైపు… కొత్తగా విడుదలయ్యే సినిమాల పైనా నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉంటుందని నిర్మాతలు, బయ్యర్లు అంటున్నారు. కరోనా కారణంగా గత ఏడాది సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు సినిమా షూటింగులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే కేవలం 50 మందితో మాత్రమే షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టాలని సూచించింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండస్ట్రీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. చిత్ర నిర్మాతలందరూ ఇందుకు సహకరించాలని కోరింది.

కాగా…..తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాత్రి కర్ఫ్యూ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు ఎగ్జిబిటర్లు. తెలంగాణలో బుధవారం నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్ల నిర్వహణఫై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. ఇందులోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘వకీల్‌సాబ్‌’ ప్రదర్శిస్తున్న థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రకటించింది.