130 ఏళ్ల తర్వాత ముంబైకి మరో ముప్పు

అరేబియా సముద్ర తీర నగరమైన ముంబైకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ఈ నగరాన్ని ముంచెత్తేందుకు నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తుఫాన్‌గా బలపడి తీరం వైపు కదులుతోంది. మరోవైపు 2020, జూన్ 02వ తేదీ మంగళవారం రాత్రి నుంచే వర్షం మొదలవ్వడంతో ముంబై ప్రజలు గజగజ వణుకుతున్నారు.
బుధవారం మధ్యాహ్నానికి : –
నిసర్గగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ప్రస్తుతం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 280 కిలో మీటర్లు… ముంబైకి దక్షణ నైరుతి దిశగా 450 కిలో మీటర్లు… అలాగే గుజరాత్‌లోని సూరత్‌కు దక్షిణ నైరుతి దిశలో 670 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ విభాగం ఇప్పటికే బులిటెన్ విడుదల చేసింది. ఈ తుపాను 2020, జూన్ 03వ తేదీ బుధవారం మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. డామన్, హరిహరేశ్వర్ మధ్య తీరం దాటే అవకాశముందన్నారు. నిసర్గ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ : –
ముంబైకి ఎగువన 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ ఇవాళ తీరం దాటనుండటంతో నగరంతోపాటు పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. గుజరాత్, ఇతర ప్రాంతాల కంటే ముంబై ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశమున్నదని హెచ్చరించింది. వరద ముప్పు కూడా ఉన్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది. సుమారు వందేండ్ల తర్వాత తొలిసారి దేశ వాణిజ్య నగరంపై తుఫాన్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది.
ప్రచండ గాలులు : –
నిసర్గ తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశముంది. గంటలకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతాయని.. చెట్లు నేలకూలే ప్రమాదముందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్‌కు 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది.
ముందస్తు జాగ్రత్తలు : –
మహారాష్ట్రలోని ఠాణె, పాల్గఢ్, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకూ హెచ్చరికలు జారీ చేసినట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు రెండురోజులు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ఇక బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక దవాఖానలోని సుమారు 150 మంది రోగులను ముందు జాగ్రత్తగా మరో చోటికి తరలించినట్లు తెలిపారు. పాల్గఢ్, రాయగఢ్‌లోని రసాయన పరిశ్రలు, అణు విద్యుత్పత్తి కర్మాగారానికి ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు.
గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ : –
ఇటు నిసర్గ తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై కూడా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వల్సాడ్, నవ్సరీ జిల్లాల్లోని 47 తీర ప్రాంత గ్రామాల నుంచి 20 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నిసర్గ తుఫాన్ దూసుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. ఐఎండీతో సమన్వయం చేసుకోవాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సూచించింది.
పీఎం మోడీ సమీక్ష : –
ఇక నిసర్గ తుఫాన్‌పై ప్రధాని మోదీ సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు మహారాష్ట్ర, గుజరాత్ అధికారులతో ఆయన మాట్లాడారు. అందరూ క్షేమంగా ఉందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. తుఫాన్ దూసుకొస్తోందని ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ప్రధాని మోదీ.
1891 తర్వాత : –
ఇక 1891 జూన్ నెలలో చివరిసారిగా ముంబైని తుఫాన్ ముంచెత్తింది. నగరాన్ని అల్లకల్లోలం చేసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు… కొన్ని రోజులపాటు రోడ్లు కనిపించని పరిస్థితులు తలెత్తడంతో జనం అల్లాడిపోయారు. వందల సంఖ్యలో జనం చనిపోయారు. ఇప్పుడు మళ్లీ 130 ఏళ్ల తర్వాత అదే తరహా తుఫాన్ దూసుకొస్తుండటం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.