తెల్లారితే పెళ్లి, పెంపుడు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 08:44 AM IST
తెల్లారితే పెళ్లి, పెంపుడు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

daughter does last rites of foster father : తెల్లారితే పెళ్లి..పెళ్లి పీటలపై మూడు ముళ్లు వేయించుకొనేందుకు..కొత్త జీవితంలోకి వెళ్లేందుకు యువతి సిద్ధమౌతోంది. అకస్మాత్తుగా..ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తనను పెంచిన తండ్రి..అనంతలోకాలకు వెళ్లిపోయాడనే వార్త జీర్ణించుకోలేకపోయింది. అంత్యక్రియల కోసం..తన వివాహాన్ని వాయిదా వేసుకుని శ్మశానానికి నడిచిన ఓ యువతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలను పక్కన పెట్టడంపై నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో చోటు చేసుకుంది.



వెరావల్ ప్రాంతానికి చెందిన అశోక్ తానా (62)కు సంతానం లేదు. దీంతో సోదరుడు జయేష్ తానా కుమార్తె ఆయుషిని పుట్టిన నెల రోజులకే దత్తత తీసుకుని పెంచసాగాడు. ఏలాంటి ఇబ్బందులు, కష్టం రాకుండా..కంటిపాపలా పెంచాడు. మంచి చదువులు చెప్పించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయుషి..అహ్మదాబాద్ లో జాబ్ వచ్చింది. పెళ్లి సంబంధాలు చూశారు కుటుంబసభ్యులు. 2020, డిసెంబర్ 07వ తేదీన ఆయుషి పెళ్లి నిశ్చయించారు.



అకస్మాత్తుగా..తానా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెరావల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ..ఆరోగ్యం మరింత విషమించడంతో..మెరుగైన వైద్యం కోసం రాజ్ కోట్ కు తరలిస్తున్నారు. కానీ..మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయుషి..కన్నీరుమున్నీరుగా విలపించింది. పెళ్లిని వాయిదా వేసుకుని కొడుకుగా మారాలని అనుకుంది. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించింది. చితికి నిప్పంటించి పెంచిన రుణం తీర్చుకుంది.



ఈ సందర్భంగా ఆయుషి మాట్లాడుతూ…తన పెంపుడు తండ్రి ఎంతో గారాబంగా పెంచారని, ఉన్నత చదువులు చెప్పించి ఎంతో ప్రేమను పంచారన్నారు. తండ్రి అంత్యక్రియలను నిర్వహించే అధికారం పెద్ద కొడుకు మాత్రమే ఉందని, కానీ..ఆయనకు కొడుకులు లేరని వెల్లడించింది. అందుకే తాను కొడుకు స్థానంలో ఉండి..చివరి కార్యక్రమాలు నిర్వహించానని ఆయుషి తెలిపింది.