Rashtrapati Bhavan Specialty : ప్రపంచ దేశాల అధ్యక్ష నివాసాలకు ధీటుగా నిలిచిన రాష్ట్రపతి భవన్ విశిష్టతలు ఏంటి ?

Rashtrapati Bhavan Specialty : ప్రపంచ దేశాల అధ్యక్ష నివాసాలకు ధీటుగా నిలిచిన రాష్ట్రపతి భవన్ విశిష్టతలు ఏంటి ?

Delhi rashtrapati bhavan Specialty : అద్భుతాలకు, సాంస్కృతిక సంపదకు కేరాఫ్‌ రాష్ట్రపతి భవన్‌. ఆవరణలోకి ప్రవేశించిస్తే చాలు.. భారతీయ సంప్రదాయం పలకరిస్తుంది. దాదాపు 17 ఏళ్లు శ్రమించి ఆ భవంతిని నిర్మించారు. ఇంతకీ రాష్ట్రపతి భవన్ విశిష్టతలు ఏంటి..? ఎంత కష్టపడి దాన్ని నిర్మించారు..? రాష్ట్రపతి నివాస సముదాయం అద్భుతాలకు నెలవు అన్న పేరు ఎందుకు వచ్చింది ?

అద్భుతం అనిపిస్తుంది రాష్ట్రపతి భవన్‌.రాష్ట్రపతి భవన్ విశిష్టతలు ఏంటి ? ప్రపంచ దేశాల అధ్యక్ష నివాసాలతో పోలిస్తే ఎందుకు ప్రత్యేకం ? అనే విషయాలు తెలుసుకుందాం. దేశంలోని అద్భుతమైన కట్టడాల్లో రాష్ట్రపతి భవన్ ఒకటి. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణశైలితో, విశాలమైన గదులు, ఆహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు రాష్ట్రపతి భవన్ పెట్టింది పేరు. 1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం అప్పట్లోనే కోటీ 40లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించారు. స్వాతంత్ర్యం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్‌గా మార్చారు.

330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం H ఆకారంలో రాష్ట్రపతి భవనం నిర్మించారు. ఈ నాలుగు అంతస్థుల భవనంలో.. మొత్తం 340గదులు ఉన్నాయ్. భవనం మొత్తం విస్తీర్ణం 2లక్షల చదరపు అడుగులు. కారిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. బిల్డింగ్ నిర్మాణం కోసం 70కోట్ల ఇటుకలు ఉపయోగించారు. 30లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లు, ఇనుముతో మొత్తం 23వేల మందికి పైగా కార్మికులు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ భవంతి నిర్మాణానికి సర్ ఎడ్విన్ లూటెన్స్‌, హెబెర్ట్ బకెర్ ఆర్కిటెక్ట్‌లుగా పనిచేశారు. ఈ నిర్మాణంలో పూర్తిగా భారతీయ సంప్రదాయ నిర్మాణ శైలి అనుసరించారు.

రాష్ట్రపతి నిలయంలో దాదాపు 190 ఎకరాల్లో రకరకాల పూలతోటలు ఉంటాయ్. ప్రపంచంలోనే అరుదైన వృక్ష, పుష్ప జాతులు ఇక్కడ దర్శనం ఇస్తాయ్. ఈ భవనంలో ఉన్న చిన్న అతిధి విభాగంలో రాష్ట్రపతి నివాసం ఉంటారు. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయ్. మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్‌లు ఈ భవనం ప్రత్యేకతలు. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా.. మొఘల్, బౌద్ధ నిర్మాణాల తరహాలో ఈ భవనం నిర్మించారు. సిబ్బంది అంతా ఈ రాష్ట్రపతి నిలయం ఆవరణలోనే ఉంటారు. రాష్ట్రపతి సేవ, నిర్వహణ కోసం 200మంది వరకు పనిచేస్తూ ఉంటారు.

రాష్ట్రపతి భవనంలోని సమావేశ మందిరంలో 104మంది అతిధులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి… మొఘల్ గార్డెన్స్‌. ఏటా ఫిబ్రవరి, మార్చిలో జనాల సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. వేల రకాల పూలమొక్కలు ఇందులో కొలువుదీరి ఉంటాయ్. ఇక రాష్ట్రపతి భవనంలోని దర్బార్‌హాల్‌లో ఏళ్లనాటి గౌతమబుద్ధుడి ప్రతిమ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రాష్ట్రపతి భవనంలో ఉన్న హాల్స్‌లో.. దర్బార్‌ హాల్‌, అశోక హాల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ కార్యక్రమం జరిగినా.. ఈ రెండు హాల్స్‌లోనే నిర్వహిస్తారు. దర్బార్‌ హాల్‌లో 5వందల మంది కూర్చునే అవకాశం ఉంటుంది. మొదటి ప్రధాని నెహ్రూ… ప్రమాణ స్వీకారోత్సవం ఈ హాల్‌లోనే జరిగింది.

ఇక అశోక హాల్‌ గోడలు.. ఫ్రెస్కో పెయింటింగ్స్‌తో రాజసం ఉట్టిపడేలా ఉంటాయ్. రెండు డ్రాయింగ్ రూమ్‌లు, రెండు భోజనాల గదులు.. ఒక గ్రంధాలయం.. హాల్‌కు నాలుగు మూలల్లో ఉంటాయ్. ఇక్కడి డైనింగ్ రూమ్‌లో అతి పొడవైన డైనింగ్ టేబుల్‌ ఉంది. 104 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా బిలియర్డ్స్ గదులు కూడా అశోక హాల్‌లో ఉన్నాయ్. ఇక రాష్ట్రపతి భవనం మధ్యలో డోమ్‌.. భారతీయ శిల్పకళలను ప్రతిబింబిస్తుంది. ఇక వెలుగులు చిమ్మే నీటి ఫౌంటెన్.. చీకట్లో రాష్ట్రపతి భవనానికి మరింత అందం తీసుకువస్తుంది. ఇక టెర్రస్ గార్డెన్.. రాష్ట్రపతి భవన్‌లో మరింత ప్రత్యేకం అనిపిస్తుంది.

ఇలా రాష్ట్రపతి భవన్‌ ఆవరణలోకి వెళ్లినా… భారతీయ సంప్రదాయాలను, సంస్కృతి పలకరిస్తాయ్. ఎన్నో అద్భుతాలకు.. రాష్ట్రపతి నివాస సముదాయం కేరాఫ్‌గా ఉంది. అలాంటి భవంతిలోకి ద్రౌపది ముర్ము.. భారత 15వ రాష్ట్రపతిగా అడుగు పెట్టబోతున్నారు..