Puri Jagannadh : పూరీ జగన్నాధుని దర్శనానికి…. ఈనెల 16 నుండి భక్తులకు అనుమతి

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

Puri Jagannadh : పూరీ జగన్నాధుని దర్శనానికి…. ఈనెల 16 నుండి భక్తులకు అనుమతి

Puri Temple

Puri Jagannadh : కరోనా కారణంగా దేవాలయాల్లో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. భక్తులు ఇళ్ళకే పరిమితం కావటంతో అధ్యాత్మిక కేంద్రాలు వెలవెల బోయాయి. దేశంలోని ప్రముఖ హిందూదేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఒడిశాలోని పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో సైతం కరోనా కారణంగా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. గత నెలలో నిర్వహించిన జగన్నాధుని రధయాత్రను సైతం భక్తులు లేకుండానే వేదపండితులు, పూరీ రాజు, సిబ్బంది కలసి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇళ్ళ కే పరిమితమై వీక్షించాల్సి వచ్చింది.

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పూరీలో వీకెండ్ లాక్ డౌన్ అమలులో ఉంది. ఈనేపధ్యంలో శని, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో స్వామి దర్శనానికి స్ధానిక భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.

మరోవైపు ఈనెల 23 నుండి పూర్తిస్ధాయిలో దేశనలుమూల నుండి వచ్చే భక్తులను పూరీ జగన్నాధుని దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు కొన్ని నిబంధనలు అమలు చేయనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా 96 రోజుల గడుపులోపుగా తీసుకున్న ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్ ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న వారికి మాత్రమే ఆలయ ప్రవేశం కల్పించనున్నారు.

కోవిడ్ మూడవ దశ ముప్పు ఉన్న నేపధ్యంలో ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టమైన అదేశాలిచ్చారు. మత ప్రదేశాల విషయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా కొన్ని నిబంధనలు పాటిస్తూ ఆలయ సందర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సియం సూచించారు. ఈక్రమంలోనే పూరీ జగన్నాధస్వామి ఆలయానికి ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను 23వ తేది నుండి అన్ని ప్రాంతాల భక్తులను అనుమతించనున్నారు. శని, ఆదివారాల్లో ఆలయం మూసే ఉంటుంది.