డీఎంకే మేనిఫెస్టో.. పదేళ్ల ప్రణాళిక.. ప్రతీ మహిళకు రూ. వెయ్యి

డీఎంకే మేనిఫెస్టో.. పదేళ్ల ప్రణాళిక.. ప్రతీ మహిళకు రూ. వెయ్యి

తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోండగా.. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా.. ప్రతిపక్ష డీఎంకే హామీలతో ఎన్నికల మరో అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తమిళనాడు అభివృద్ధి కోసం పదేళ్ల వ్యూహమంటూ రిలీజ్‌ చేసింది. రానున్న దశాబ్దకాలంలో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలపడమే ఈ విజన్‌ లక్ష్యమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రకటించారు. ఎన్నికల్లో డీఎమ్‌కే మేనిఫెస్టోనే హీరో అని అన్నారు స్టాలిన్.

తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసందోహం మధ్య టెన్‌ ఇయర్స్‌ విజన్‌ ప్రకటించారు. ఆర్థికం, వ్యవసాయం, నీటి నిర్వాహణ, విద్య ఆరోగ్యం పరిశుభ్రత, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, సామాజిక న్యాయం అనే ఏడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు. మేనిఫెస్టోలో డీఎంకే ఇచ్చిన హామీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

రాబోయే పదేళ్లలో ప్రతీ ఏడాదికి పది లక్షల ఉద్యోగాల వంతున కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామనని తమిళ ప్రజానీకానికి హామీనిచ్చారు స్టాలిన్‌. తద్వారా ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 36 లక్షల కుటుంబాలకు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించడంతోపాటు మంచినీటి వృధాను అరికడగతామని చెప్పారు. సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు రెట్టింపు చేస్తామన్నారు. ఇక ప్రతీ గృహిణికి నెలకు వెయ్యి రూపాయల ఫించను అందిస్తామన్నారు. రేషన్‌ కార్డు ఉంటే చాలు.. మహిళలందరికీ నెలనెలా వెయ్యి రూపాయలు అందిస్తామని హామీనిచ్చారు.

విద్య, వైద్యం, ఆరోగ్యంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది డీఎంకే. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో 1.9 శాతంగా ఉన్న ఎడ్యుకేషన్‌ బడ్జెట్‌ను 6 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించింది. 0.75 శాతం ఉన్న ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను 2 శాతానికి పెంచుతామన్నారు. ప్రతీ గ్రామంలో హాస్పటల్‌, స్కూల్‌ను నిర్మించడంతో పాటు అందుకు తగ్గట్టు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం తమిళనాడు పట్టణ ప్రాంతాల్లో 16శాతంగా ఉన్న మురికివాడలను 5శాతానికి తగ్గించనున్నట్టు ప్రకటించారు స్టాలిన్‌. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 9 లక్షల 75 వేల కాంక్రీట్‌ ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 20 లక్షల మందికి కాంక్రీట్‌ ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాబోయే పదేళ్లలో ఆర్థిక వృద్ధిరేటును రెండు అంకెలకు తీసుకెళ్తామని ఫలితంగా పదేళ్లలో తమిళనాడు బడ్జెట్‌ను 35 లక్షల కోట్లకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు స్టాలిన్‌.

కొత్తగా రాష్ట్రంలో 11.75 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకొస్తామని స్టాలిన్‌ ప్రజలకు హామీనిచ్చారు. ప్రస్తుతం 10 లక్షల హెక్టార్లలో రెండు పంటలు పడుతుండగా ఈ మొత్తాన్ని 20 లక్షల హెక్టార్లకు తీసుకెళ్తామన్నారు. వాణిజ్య పంటలైన చెరుకు, కొబ్బరి, పత్తి, సన్‌ప్లవర్‌ పంటల సాగులో నాణ్యమైన పద్దతులు ప్రవేశపెడతామన్నారు. అడవుల విస్తీర్ణాన్ని 20 శాతం నుంచి 25 శాతానికి తీసుకెళ్తామన్నారు.

డీఎంకే నిర్వహించిన ఈ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. పదేళ్ల ప్రణాళికను సరిగా అమలు చేస్తే తమిళనాడు బడ్జెట్‌ 35 లక్షల కోట్లకు చేరుకుంటుందని స్టాలిన్‌ అన్నారు. దీని వల్ల ప్రతీ ఏడు పది లక్షల ఉద్యోగాల వంతున పదేళ్లల్లో కోటి మందికి ఉద్యోగాలు కల్పిచడం అసాధ్యమేమీకాదన్నారు. కోటి ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగం తగ్గడంతో పాటు ప్రజల తలసరి ఆదాయం నాలుగు లక్షలకు చేరుతుందని చెప్పారు. మరి డీఎంకే విడుదల చేసిన ఈ మేనిఫెస్టో పార్టీని విజయ తీరాలకు చేర్చుతుందో.. లేదో చూడాలి.

రానున్న పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పన
పేదరికం నుంచి ప్రజలకు విముక్తి
36 లక్షల కుటుంబాలకు తాగునీరు
స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేస్తామని హామీ
ప్రతీ మహిళకు రూ.1000 ఫించన్‌
విద్య, వైద్యం, ఆరోగ్యంపై స్పెషల్‌ ఫోకస్‌
ఎడ్యుకేషన్‌ బడ్జెట్‌ 6శాతానికి పెంచుతామని హామీ
వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను 2శాతానికి పెంచుతామన్న స్టాలిన్‌
ప్రతి గ్రామంలో స్కూల్‌, హాస్పిటల్‌ నిర్మాణం
16శాతంగా ఉన్న మురికివాడలు 5శాతానికి తగ్గింపు
పట్టణ ప్రాంతాల్లో 9,75,000 కాంక్రీట్‌ ఇళ్ల నిర్మాణం
గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల మందికి ఇళ్లు
పదేళ్లలో 35 లక్షల కోట్లతో బడ్జెట్‌
11.75 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి తీసుకొస్తామని హామీ
20 లక్షల హెక్టార్లలో రెండు పంటలు పండించేందుకు చర్యలు
వ్యవసాయరంగంలో నాణ్యమైన పద్దతులు
అడవుల విస్తీర్ణం 25 శాతానికి తీసుకెళ్తామని హామీ