Arms pooja : దుర్గాష్టమిరోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇతర వృత్తి పనివారులంతా దుర్గాష్టమిరోజున తాము ఉపయోగించే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు.

Arms pooja : దుర్గాష్టమిరోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

Dussehra

Arms pooja : విజయదశమి పర్వదినం వస్తుందంటే చాలు అందరికి గుర్తుకు వచ్చేది ఆయుధపూజ. పండుగ ముందురోజు నిర్వహించే ఈ పూజకు ఎంతో చారిత్రక పాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు. దేవతలు, రాక్షసుల మధ్యన జరిగిన సంగ్రామంలో ఉత్తరాషాడ శ్రవణం నక్షత్రాల మధ్య అభిజిత్ లగ్నంలో దేవతలు రాక్షసులపై విజయం సాధించారు. ఆసందర్భాన్ని పురస్కరించుకుని విజయదశమి ముందు రోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుంది.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయం సాధించాడు. ఆనాటి నుండి ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టుకు పవిత్రత సంతరించుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేందుకు అర్జునుడు జమ్మిచెట్టు తొర్రలో దాచి ఉంచిన అయుధాలను విజయదశమికి ఒకరోజు ముందు క్రిందికి తీసి పూజలు నిర్వహించి యుద్ధానికి బయలు దేరతాడు. ఆయుద్ధంలో విజయం సాధించటంతో ఆ విజయాలకు గుర్తుగా అప్పటి నుండి ఆయుధపూజ ప్రారంభమైందని మరో కధనం ప్రాచుర్యంలో ఉంది.

మన దక్షిణ భారతదేశంలో ఈ ఆయుధపూజ ను ఎక్కువగా మహా నవమినాడు చేస్తూ ఉంటారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆయుధం చేపట్టి దుర్గాష్టమి రోజున దుర్గముడు అనే రాక్షసుడిని , మహా నవమి నాడు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడంతో ఆయుధాలను శక్తి స్వరూపిణిగా భావించి పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఆయుధాల శత్రు సంహారానికి మాత్రమే వినియోగించాలని, ఆయుధం దుర్వినియోగం చేయకూడదని ఈ ఆయుధ పూజ విధానం ద్వారా అందరికి బోధపడుతుంది.

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇతర వృత్తి పనివారులంతా దుర్గాష్టమిరోజున తాము ఉపయోగించే పనిముట్లను, యంత్రాలను, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలో ఉండే శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల దోష నివారణ జరిగి వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

విద్యార్థులు తమకు విజయం చేకూరాలని పెన్నులు పుస్తకాలను దేవుడి ముందర పెట్టి పూజించటం, పోలీసులు తాము వినియోగించే లాఠీ,తుపాకులు, రైతులు అయితే కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, టైలర్లు తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించటం ప్రస్తుతం మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఆయుధ పూజ రోజున ఓం దుం దుర్గాయైనమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా అంతా శుభం కలుగుతుందని నమ్ముతారు. లలిత అష్టోత్తరాలు పఠించి ఆ తర్వాత ఆయుధ పూజ, అస్త్రపూజలు చేయాలి.