కేరళలో మరో దారుణం : కుక్క మూతికి టేపు..రెండు వారాలుగా ఆకలితో

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 03:32 AM IST
కేరళలో మరో దారుణం : కుక్క మూతికి టేపు..రెండు వారాలుగా ఆకలితో

మనిషి క్రూరత్వానికి జంతువులు బలవుతున్నాయి. పేలుడు పదార్థాలతో నిండిన కొబ్బరిబోండాం తిని మృతి చెందిన ఏనుగు ఘటన మరవకముందే కేరళలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆకతాయిల దుశ్చర్యతో శునకం రెండు వారాలు నరకం అనుభవించింది.

త్రిసూర్ లో కొందరు వ్యక్తులు మూడేళ్ల శునకం మూతి చుట్టూ టేపు చుట్టి వదిలేశారు. టేపు బలంగా చుట్టడంతో ఆ ప్రాంతం మొత్తం పుండు ఏర్పడి శునకం విలవిల్లాడింది. ఒల్లూరు చౌరస్తాలో దయనీయ స్థితిలో ఉన్న కుక్కను గమనించారు. పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీసుకు సమాచారం అందింది. దీంతో వారు ఒల్లూరు కూడలిలో ఉన్న ఆ కుక్కను పట్టుకున్నారు.

టేపును తొలగించి ఆసుపత్రికి తరలించారు. టేపును తొలగించిన వెంటనే దాదాపు రెండు లీటర్ల నీరు తాగింది. శునకం మెడలో కాలర్ చుట్టి ఉండటంతో దానిని పెంపుడు జంతువుగానే భావిస్తున్నారు. కుక్క మూతికి టేపులను బలంగా అంటించారని, మూతిపై ఉండే చర్మాన్ని కోసేయడం వల్ల రక్తం కారిందని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ కార్యదర్శి రామచంద్రన్ వెల్లడించారు.

అరవకుండా ఉండేందుకు ఆ టేపును అంటించి ఉంటారని, రెండు వారాలు కావడంతో..ఆకలి..దప్పికతో అల్లాడిందన్నారు. కుక్కలు ఆకలితో ఎక్కువ రోజులు జీవించి ఉండగలవని, ఈ కారణంతోనే ఇది ఇంకా బతికి ఉందన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మూగజీవాలతో క్రూరంగా ప్రవర్తిస్తున్న వారికి కూడా అలాంటి శిక్ష వేయాలని నెటిజన్లు మండిపడుతున్నారు.