నేనే గెలిచానని ప్రకటించు.. అమెరికాలో ట్రంప్ ఆడియో టేప్ సంచలనం!

నేనే గెలిచానని ప్రకటించు.. అమెరికాలో ట్రంప్ ఆడియో టేప్ సంచలనం!

అమెరికాలోని దక్షిణాది రాష్ట్రంలో జో బైడన్ విజయాన్ని తారుమారు చేయడానికి తగిన ఓట్లు తనకు వచ్చినట్లుగా ఫలితాన్ని తారుమారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జార్జియా రాష్ట్ర కార్యదర్శితో ఈమేరకు ట్రంప్ మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్‌ జో బైడెన్‌ పదవీ స్వీకార ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతన్న సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటువంటి చర్యకు దిగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు ఫలితాన్ని ప్రకటించాలంటూ, జార్జియా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బ్రాడ్‌ రాఫెన్స్‌ర్‌జర్‌ను కోరారు. ఈ మేరకు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో కాల్‌ సంచలనం రేపుతోంది. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకుని రాగా.. ఆడియో కాల్‌‌లో అధికారిని ట్రంప్ బెదిరించినట్లుగా అర్థం అవుతుంది. తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పకుంటే.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ తోటి రిపబ్లికన్‌ బ్రాడ్‌ను ట్రంప్‌ బెదిరించారు. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే పెద్ద రిస్క్‌ చేసినవాడివి అవుతావంటూ తీవ్రస్థాయిలో ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ మాట్లాడిన టేప్‌లో విషయం ప్రకారం.. “ఫలితాలను చూసి జార్జియా ప్రజలు, దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా మీరెలా పనిచేస్తారు. మీరు నాకోసం ఈ పని చెయ్యాల్సిందే. నాకు 11,780 ఓట్లు వచ్చాయని చెప్పండి. నిజానికి మాకు అంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. అక్కడ మేమే గెలిచాం. జార్జియాలో ఎట్టిపరిస్థితుల్లోనూ మేము ఓడిపోయే ప్రసక్తే లేదు. వందలు, వేల ఓట్ల మెజారిటీ వస్తుంది మాకు. నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు చాలా పెద్ద రిస్క్‌ తీసుకుంటున్నారు. మీరు, మీ లాయర్‌ రేయాన్‌ ఇందుకు క్రిమినల్‌ అఫెన్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అంటూ ట్రంప్ అందులో మాట్లాడారు.