అయోధ్య రామాలయం, ఇక ఆన్ లైన్ లో విరాళాలు

అయోధ్య రామాలయం, ఇక ఆన్ లైన్ లో విరాళాలు

Ayodhya

Ayodhya ramalayam Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. మొత్తం రూ. 2 వేల 500 కోట్ల విరాళాలు వచ్చాయని, నగదుకు సంబంధించి అడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. భక్తులు విరాళం ఇవ్వాలనుకొంటే ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.

ట్రస్టు వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వడానికి ఇంకా అవకాశం ఉందని చెప్పారు. రామాలయ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు కేటాయించిన 70 ఎకరాలకే పరిమితం చేయకుండా.. 107 ఎకరాల్లో విస్తరించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధానాలయాన్ని 5 ఎకరాల్లో నిర్మిస్తామని, ప్రస్తుతం ఉన్న స్థలం పక్కన మరింత భూమిని కొనుగోలు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. రామమందిర నిర్మాణానికి హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకున్నారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరించింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా నిధులను సమీకరించారు. జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టింది. అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. 15 వందల కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేయగా ఇప్పటికే ఆ మార్క్‌ దాటేసింది.