ఆసుప‌త్రిలో చేరిన ఆరోగ్య మంత్రి..క‌రోనా వైర‌సేనా ?

  • Published By: madhu ,Published On : June 16, 2020 / 05:34 AM IST
ఆసుప‌త్రిలో చేరిన ఆరోగ్య మంత్రి..క‌రోనా వైర‌సేనా ?

క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. విజృంభిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి ఎంతో బ‌లి తీసుకొంటోంది. ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. భార‌త‌దేశంలో కూడా దిక్కుమాలిన వైర‌స్ వ‌ల్ల చాలా మంది బ‌ల‌వుతున్నారు. నేత‌లు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంత‌మంది క్వారంటైన్ కు వెళుతుండ‌గా..మ‌రికొంత‌మంది హోం క్వారంటైన్ కు వెళుతున్నారు.

తాజాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి స‌త్యేంద్ర జైన్ కూడా వైర‌స్ బారిన ప‌డ్డారు. దీంతో ఇత‌ర నేత‌ల్లో టెన్ష‌న్..టెన్ష‌న్ ప‌డుతున్నారు. త‌మ‌కు ఎక్క‌డ సోకుతుందోన‌న్న భ‌యం వారిలో నెల‌కొంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ కరోనాతో వ‌ణికిపోతోంది. క‌రోనా వైర‌స్ అనుమానిత ల‌క్ష‌ణాల‌తో 2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం రాత్రి రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రిలో చేరారు. రాత్రి హై గ్రేడ్ జ్వ‌రం, ఆక్సిజ‌న్ స్థాయి అక‌స్మాత్తుగా ప‌డిపోవ‌డంతో..ఆసుప‌త్రిలో చేరారు.

ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశారు. అధిక జ్వ‌రం, శ్వాసకోశ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇటీవ‌లే సీఎం కేజ్రీవాల్ అనారోగ్యం కార‌ణంగా…స్వీయ నియంత్ర‌ణ‌లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌కు వైద్యులు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ రావ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చేరిన‌..స‌త్యేంద్ర జైన్..అనారోగ్యానికి గురికాక‌ముందు..కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం కేజ్రీవాల్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. మ‌రి..ఆయ‌న రిపోర్టుల కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు.