Telangana Early Elections : మరో 6నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు? తెలంగాణలో జోరుగా ముందస్తు ఊహాగానాలు, సిద్ధమవుతున్న పార్టీలు

తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.

Telangana Early Elections : మరో 6నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు? తెలంగాణలో జోరుగా ముందస్తు ఊహాగానాలు, సిద్ధమవుతున్న పార్టీలు

Telangana Early Elections : తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. రెండు పార్టీలు ముందస్తు ముచ్చట్లు మొదలుపెట్టాయి. ఓవైపు ముందస్తు ఎన్నికలు ఉండవు అంటూనే.. మరోవైపు రెండు పార్టీలు ముందస్తు జపం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలపై తొందరేముంది అంటూనే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమేనంటూ సంకేతాలు ఇస్తున్నాయి.

ఇంతకీ ఎన్నికలకు 12నెలల సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ముందస్తు ఎన్నికల మాట ఎందుకు వినిపిస్తోంది? అందుకు కారణాలు ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ నిత్యకృత్యం అయ్యాయి. రోజూ ఏదో ఒక చోట ఎవరో ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో దర్యాఫ్తు సంస్థల సోదాలు, తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read : Telangana assembly session: అన్ని విషయాలు ప్రజలకు తెలిపేందుకు డిసెంబరులో శాసనసభ సమావేశాలు: కేసీఆర్

ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతికూల పరిస్థితులన్నీ దాటి మూడోసారి అధికారం అందుకోవడం ముందస్తుతో మాత్రమే సాధ్యమన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో మళ్లీ ముందస్తు రాగాలు వినిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.

2018లో లాగానే 2023లో ఆరేడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే ఐదేళ్ల పాలనా పగ్గాలు దక్కుతాయన్న ఆలోచనకు కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. వచ్చే జనవరి తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కర్నాటకతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారాలన్నీ నిజమే అయితే ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారు. ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ దిశగా పార్టీ కేడర్ కు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, నేతలు జనంలో ఉండాలన్న కేసీఆర్ సూచన.. ముందస్తు కోసమేనని గులాబీ వర్గాలు నమ్ముతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజా పరిణామాలతో ఒక రకంగా రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం బీజేపీని ఇరుకున పెట్టింది. ప్రస్తుత పొలిటికల్ సెంటిమెంట్ నడుస్తున్న సమయంలోనే ఎన్నికలు జరపాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.

డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలను సీఎం కేసీఆర్.. బీజేపీపై దాడికి వేదికగా మార్చుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సమావేశాల అజెండాలపై ఇప్పటికే ప్రగతిభవన్ లో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డితో చర్చించారు. ఈ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు అన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read : Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపైనా కేసీఆర్, హరీశ్ రావు మధ్య చర్చ జరిగింది. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక సమావేశానికి గైర్హాజరైన హరీశ్ రావు.. కేంద్రం నిర్ణయాలతో రూ.40వేల కోట్ల లోటు వస్తోందని సీఎంకు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక విధానాలను అసెంబ్లీలో ఎండగట్టనున్నారు కేసీఆర్.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి వివరించనున్నారు. వరుసగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఐటీ, ఈడీ దాడులు జరగటాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయనున్నారు. ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ విధానాలపై రాజకీయ దాడి కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీని రద్దు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే.. ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలపై తొందర ఏముందని ఆయన ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నాం అన్నారు. సింపతీ కోసమే సీఎం కేసీఆర్ రోజుకో తప్పు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.