వంటింట్లో నూనె మంట, ధర మసలుతోంది

వంటింట్లో నూనె మంట, ధర మసలుతోంది

వంట చేయాలంటే..నూనె కంపల్సరీ. నూనె లేనిదే ఏ వంట కాదు. అమాంతం ధరలు పెరిగేసరికి…సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. పెరిగిన వంట నూనెల ధరలు చూసి హడలిపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ధర రూ.140 నుంచి రూ.150లు వరకు, పామాయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ ధర రూ.120 ల నుంచి రూ.130 లు, వేరుశనగ ఆయిల్‌ ప్యాకెట్‌ ధర రూ.150 నుంచి రూ. 160 ల వరకు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.140ల నుంచి రూ.150లు, గానుగ పట్టించిన పల్లీనూనె లీటర్‌ రూ. 400ల వరకు పలుకుతోంది.

గత రెండు నెలల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే లీటర్‌ వంట నూనెపై సుమారు రూ. 40 లు నుంచి రూ. 60 ల వరకు పెరగడంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటలు చేయాలంటే నూనె కంపల్సరీ కావడంతో ఏమి చేయలేకపోతున్నారు. ఇంట్లో కనీసం పిండి వంటలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వేయకుండా..కొద్దిగా వేసుకుంటూ..సర్దుకుపోవాల్సి వస్తోందని గృహిణులు వెల్లడిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఇతర దేశాల నుంచి సరఫరా లేక పోవడంతో ధర ల పెరుగుదల నమోదవుతోందని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే నూనెలు, నూనె గింజలపై దిగుమతి సుంకం పెంచబోతున్నామని ప్రకటించడంతో వ్యాపారులు అప్పటికప్పుడే ధరలు పెంచేశారు. గత రెండు రోజులుగా ఉన్న ధరలను ఒక కేస్‌ (15 కిలోలు) బాక్సులు, టిన్‌లపై సుమారు రూ. 50 నుంచి 100లు పెంచి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై సుంకాలు విధించకుండా..ఉంటేనే ధరలు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అర్జైంటైనా, మలేసియా దేశంలో వంట నూనెలకు సంబంధించిన ఉత్పత్తులు డిమాండ్ కు తగ్గట్టు లేవు.