బెజోస్ ని వెనక్కి నెట్టేసి…ప్రపంచపు నెం.1 ధనవంతుడిగా ఎలాన్ మస్క్

బెజోస్ ని వెనక్కి నెట్టేసి…ప్రపంచపు నెం.1 ధనవంతుడిగా ఎలాన్ మస్క్

Elon Musk Is World’s Richest Person ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌. అయితే, ఇప్పుడు తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ ని వెనక్కి నెట్టేసి..ఈ భూమిపైనే అత్యంత అధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మారారు.

జెఫ్ బెజోస్ కన్నా ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ ఏకంగా 188.5 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. మస్క్..ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గురువారం నాడు టెస్లా సంస్థ ఈక్విటీ విలువ స్టాక్ మార్కెట్ లో 4.8 శాతం పెరగడంతో ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని బ్లూమ్ బర్గ్ తెలియజేసింది. ఇక గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్‌.. ఏడాది కాలంలోనే మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం.

2020 నవంబర్‌ చివరిలో.. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచిన ఎలాన్‌ మస్క్‌ .. ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే మొదటి స్థానానికి చేరారు. కాగా, నవంబర్ తరువాత పరిస్థితులు టెస్లాకు అనుకూలంగా మారాయి. డెమోక్రాట్లు జార్జియా సెనెట్ సీట్లను సొంతం చేసుకోవడం, బైడెన్ అధికారంలోకి రావడంతో సాధ్యమైనంత త్వరగా పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను రీప్లేస్ చేయాలన్న ఆదేశాలు వస్తాయన్న అంచనాలతో టెస్లా విలువ మరింతగా పెరిగింది.

ఇక ఎలాన్‌ మస్క్‌ కేవలం కార్ల సంస్థనే కాకుండా స్పేస్‌ ఎక్స్‌ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్‌ అనే మరో సంస్థను కూడా స్థాపించారు. సౌతాఫ్రికాలో జన్మించి, విద్యుత్ కార్ల రంగంతో పాటు వాణిజ్య అంతరిక్ష విభాగంలోనూ రాణిస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న49 ఏళ్ల మస్క్..భవిష్యత్తులో తన ఆస్తులను మరింతగా పెంచుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.