కరోనాతో మాజీ ఎంపీ మేనకోడలు మృతి

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 03:57 AM IST
కరోనాతో మాజీ ఎంపీ మేనకోడలు మృతి

దేశ రాజధాని ఢిల్లీని కరోనా కలవరపెడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. సమయానికి ICU లో చికిత్స అందలేక మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ మేనకోడలు మరణించింది. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వైద్య సేవలు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ సంఘటన నిరూపించిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

సిద్ధిఖీ మేనకోడలు ముమ్మన్ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఆమెను కుటుంబసభ్యులు సప్దర్ జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ..అక్కడ అడ్మిట్ చేసుకోలేదు. సమయానికి వెంటిలేటర్ అందకపోవడంతో చనిపోయారు. ఎలాంటి వ్యవస్థను నడుపుతున్నామని ఆయన ప్రశ్నించారు. ప్రజలను రక్షించడానికి ఆసుపత్రులు పనిచేయడం లేదని, దీనిపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో సంక్షోభం తీవ్రత నానాటికీ పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,971 కేసులు నమోదవడంతో… భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 46వేల 628కి చేరుకుంది. మరోవైపు నిన్న 287 కరోనా మరణాలు సంభించాయి. రోజువారీ మరణాల సంఖ్యలో ఈ స్థాయి పెరుగుదల నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాదు… వరుసగా నాలుగో రోజు దేశంలో 9 వేల పైచిలుకు కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్షా 20వేల 406కాగా.. ఇప్పటివరకూ 6,929 మంది కరోనాకు బలైపోయారు. అయితే… సోమవారం నుంచి ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో తెరవనుండటంతో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి కాటుకు ఢిల్లీ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. ఆదివారం కొత్తగా 1,282 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,936కి పెరిగింది.

ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 812 మంది మరణించగా.. కరోనా నుంచి కోలుకొని 10,999 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,125గా  ఉంది. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. అయితే… ఈ కేసుల సంఖ్య  నెలాఖరు నాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది.

 

Read:  కరోనా కలకలం : PIB (Press Infermation Bureo) కేంద్రం మూసివేత