Visakhapatnam: ప్రభుత్వాసుపత్రిలో కాలం చెల్లిన రెమిడీసివిర్.. ఆందోళనలు!

కరోనా మహమ్మారికి వైద్యంలో రెమిడీసివిర్ ఓ సంజీవనిగా భావించడంతో దాని చుట్టూ జరిగిన రచ్చ అంత ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు కరోనా సోకిన వారి బంధువులు ఈ ఇంజక్షన్ కోసం నానాతిప్పలు పడినా దొరకని పరిస్థితి.

Visakhapatnam: ప్రభుత్వాసుపత్రిలో కాలం చెల్లిన రెమిడీసివిర్.. ఆందోళనలు!

Visakhapatnam

Visakhapatnam: కరోనా మహమ్మారికి వైద్యంలో రెమిడీసివిర్ ఓ సంజీవనిగా భావించడంతో దాని చుట్టూ జరిగిన రచ్చ అంత ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు కరోనా సోకిన వారి బంధువులు ఈ ఇంజక్షన్ కోసం నానాతిప్పలు పడినా దొరకని పరిస్థితి. మరోవైపు కరోనా సోకిన తొలి రెండు మూడు రోజులలో మాత్రమే ఈ ఇంజక్షన్ పూర్తిస్థాయి ఫలితం ఉంటుందని.. ఆ తర్వాత వాడినా ఉపయోగం లేదని కొందరు వైద్యనిపుణులు చెప్పారు. ఒకదశలో ఈ ఇంజెక్షన్ దందా ఓ రేంజిలో సాగింది. ఈ మందు కంపెనీ ధరకు ఏడెనిమిది రేట్లు కూడా పెంచి బ్లాక్ లో అమ్మకాలు జరిగాయి.

ఇప్పటికీ కరోనా వైద్యంలో చాలా ఆసుపత్రులు రెమిడీసివిర్ ఉపయోగిస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా వినియోగం ఉంటుంది. అయితే.. ఇప్పటికీ కాసులకు కక్కుర్తి పడే కొందరు కాలం చెల్లిన ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన రెమిడీసివిర్ ఇంజెక్షన్లపై కొత్త స్టిక్కర్ అంటించి రోగులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఇక్కడ దుమారం రేగింది.

నర్సీపట్నం ఆసుపత్రిలో చిటికెల తాతమ్మ నాయుడు, ఎ.సన్యాసిరావు, ఎస్.అరుణ్ చంద్ అనే ఈ ముగ్గురు మరణించారు. వీరిలో చిటికెల తాతమ్మ నాయుడు జర్నలిస్ట్ కాగా వీరు ముగ్గురు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ తీసుకున్నట్టు ఆసుపత్రి రిజిస్టర్ లో నమోదైంది. కాగా, తమవారికి గడువు ముగిసిన రెమిడీసివర్ ఇంజక్షన్లు ఇవ్వడంతోనే వారు మరణించారని రోగుల బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. వీరికి జిల్లా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు.

కాగా.. భారత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 104ఏ కింద ఏ డ్రగ్ అయినా తయారీ సంస్థ అంటించిన లేబుల్ మీద మరో లేబుల్ ను అంటించకూడదు. కానీ ఇక్కడ రెమిడిసివర్ ఇంజక్షన్ బాటిల్ పై మందు తయారు చేసిన మైలాన్ సంస్థ లేబుల్ పై మరో లేబుల్ అంటించి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండో లేబుల్ ను నెమ్మదిగా తీసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అయితే.. ప్రభుత్వం నుండి తమకి ఇవే దిగుమతి అయ్యాయని జిల్లా వైద్యాధికారులు ఆర్డర్ కాపీని చూపిస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన మరో ఆరునెలలు డ్రగ్ పనిచేస్తుందని.. అందుకే ప్రభుత్వమే స్టిక్కర్స్ అంటించి సరఫరా చేస్తుందని కొందరి వైద్యనిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా రెమిడీసివిర్ పేరిట మరో కొత్త వివాదం మొదలైనట్లుగా కనిపిస్తుంది.