పేలిపోయిన Starship‌, విజయం సాధించామన్న SpaceX

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 09:21 AM IST
పేలిపోయిన Starship‌, విజయం సాధించామన్న SpaceX

exploded-starship : వరుస విజయాలతో దూసుకుపోతున్న స్పేస్‌ ఎక్స్‌ (SpaceX) సంస్థకు తొలిసారి షాక్‌ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్టార్‌ షిప్ (Starship)‌ ప్రయోగం.. చివరి నిమిషంలో పేలిపోయింది. కానీ తాము అనుకున్నది సాధించామంటుంది స్పేస్‌ ఎక్స్‌.  సాధించిన విజయం ఏంటీ ? స్టార్‌ షిప్‌ (Starship) పేలిపోవడానికి గల కారణాలేంటి ? స్పేస్ఎక్స్ (Starship) సంస్థ తాజాగా స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించింది. SN 8 (SN8 explodes) కోడ్ పేరుతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కోకా చికా ఆర్ అండ్ డీ కేంద్రం నుంచి 50 మీట‌ర్ల పొడుగు ఉన్న స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. సుమారు 12.5 కిలోమీట‌ర్ల దూరం అంటే సుమారు 41 వేల ఫీట్ల ఎత్తుకు దూసుకెళ్లింది స్టార్‌షిప్‌.



ఆ త‌ర్వాత తిరుగు ప్రయాణ‌ంలో కూడా అంతా సవ్యంగానే ఉన్నా చివరి నిమిషంలో లోపం తలెత్తడంతో ల్యాండింగ్ స‌మ‌యంలో పేలిపోయింది. అయితే ఈ ప్రయోగం పట్ల స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధినేత ఎల‌న్ మ‌స్క్ ఆనందం వ్యక్తం చేశారు. త‌మ టెస్టింగ్ ప్రక్రియ స‌క్సెస్ అయిన‌ట్లు ప్రకటించారు.. స్టార్‌షిప్ ప్రాజెక్టుపై ఎల‌న్ మ‌స్క్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. స్పేస్ఎక్స్ సంస్థకు ఇదే భ‌విష్యత్తు అన్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు. అంత‌రిక్షంలోకి మ‌నుషుల్ని, కార్గో సేవ‌ల్ని ప్రారంభించేందుకు స్టార్‌షిప్ రాకెట్‌ను స్పేస్ఎక్స్ అభివృద్ధి చేస్తుంది.



చంద్రుడి మీద‌కు, మార్స్ గ్రహం మీద‌కు కూడా ప్రయోగాలు చేప‌ట్టేందుకు స్టార్‌షిప్ ప్రొటోటైప్ రాకెట్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈ ప్రయోగంతో త‌మ‌కు కావాల్సిన డేటా వ‌చ్చిన‌ట్లు స్పేస్ఎక్స్ సీఈవో వెల్లడించారు. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు మార్గం సులువైన‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయిన తర్వాత సైంటిస్టులు ఇంజన్‌లను ఆపేశారు. తిరిగి ల్యాండింగ్‌ సమయంలో ఇంజన్లను తిరగి ప్రారంభించారు. ఇక్కడే సాంకేతిక సమస్య ఏర్పడిందని, అందుకే స్టార్ షిప్ కూలిపోయిందని సైంటిస్టులు తెలిపారు.