రిటైర్మెంట్ ప్రకటించిన ఫాఫ్ డు ప్లెసిస్

రిటైర్మెంట్ ప్రకటించిన ఫాఫ్ డు ప్లెసిస్

దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 36 ఏళ్ల ఫాఫ్ డు ప్లెసిస్ తన దేశం కోసం 69 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 40.03 సగటుతో 4163 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో 10 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న డు ప్లెసిస్ బుధవారం(17 ఫిబ్రవరి 2021) ఈ ప్రకటన చేశారు.

పాకిస్తాన్ పర్యటనలో అనుభవజ్ఞుడైన ఫాఫ్ డు ప్లెసిస్.. బ్యాట్స్ మాన్‌గా ఘోరంగా విఫలం అవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలికాలంలో శ్రీలంక పర్యటనలో, డు ప్లెసిస్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. గత సంవత్సరం నుండి అతని ఫామ్‌ని ప్రశ్నిస్తున్న విమర్శకులకు సెంచెరీతో సమాధానం చెప్పాడు. ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనబడిన ఫాఫ్ డు ప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.

రిటైర్మెంట్ సంధర్భంగా.. ‘‘నా దేశం తరఫున ప్రతీ ఫార్మాట్లలో ఆడటం గర్వంగా ఉంది. అయితే ఇప్పుడు టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకొనే సమయం వచ్చింది. వచ్చే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. అందుకే పొట్టిఫార్మాట్‌పై దృష్టిసారించాలని నిర్ణయం తీసుకున్నాను.. సాధ్యమైనంత వరకు ఆడుతూ.. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, ఇస్తానని ఆశిస్తున్నా’’ అని డుప్లెసిస్‌ అన్నాడు.

ఈ నెల చివర్లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవలసి ఉంది, కాని కోవిడ్ -19 ఆందోళనల కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటనను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌తో టెస్ట్ క్రికెట్ కెరీర్‌ని ముగించాలని అనుకుంటున్నట్లు డూ ప్లెసిస్ ప్రకటించారు.