నేటి నుంచి ప్రతి ఇంట్లో జ్వర పరీక్షలు, కరోనా రహిత గ్రామాలే లక్ష్యం

మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 02:00 AM IST
నేటి నుంచి ప్రతి ఇంట్లో జ్వర పరీక్షలు, కరోనా రహిత గ్రామాలే లక్ష్యం

మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం

మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. కరోనా అంతం చూసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీ ప్రణాళిక సిద్దం చేసింది. ముఖ్యంగా గ్రామాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి(మే 15,2020) నుంచి గ్రామాల్లో ఇంటింటి జ్వర పరీక్షలు నిర్వహించనుంది.

కరోనా రహిత గ్రామాలే లక్ష్యం:
కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం గ్రామీణుల దరిచేరకుండా ఉండేందుకు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సందర్భంలో ప్రతి వ్యకిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై అంచనాలు రూపొందిస్తున్న విధంగానే కరోనాను ముందస్తుగా గుర్తించేందుకు ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా లక్షణాలున్నవారి వివరాలను నమోదుచేస్తారు. ఎవరికైనా జ్వర, కరోనా సంబంధిత లక్షణాలుంటే అలాంటి వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 43,900 మంది సిబ్బందితో కార్యాచరణ మొదలు పెట్టింది. 

సర్వేలో వ్యాధుల నమోదు:
కింది స్థాయిలో కరోనా సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా వైరస్‌ లక్షణాలున్నాయేమో తెలుసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఆసుపత్రుల్లో ఓపీడీ సేవలు పొందేందుకు వచ్చేవారి వివరాలను సాధారణ వ్యాధులు, కరోనా సంబంధిత వ్యాధిగ్రస్థులను వేరుగా నమోదు చేయాలని సూచించారు. గురువారం(మే 14,2020) ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైరస్‌ అనుమానిత లక్షణాలున్నవారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయాలని ఐసీఎమ్మార్‌ సూచించిందని, కేంద్రంలో, రాష్ట్రంలో అవే విధానాలు అవలంభిస్తున్నట్టు వివరించారు. 

బయటి నుంచి వచ్చిన వారికి 14 రోజులు క్వారంటైన్‌:
ఇతర ప్రాంతాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చినవారిలో కరోనా లక్షణాలు లేకున్నా 14 రోజులు ఇళ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణకు అన్నివిభాగాలు కృషిచేస్తున్నాయని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో 95శాతం మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 2 శాతం నమోదైనట్టు తెలిపారు. తక్షణ సేవలకు 102, 104, 108 వాహనాలు సకాలంలో పనిచేస్తున్నాయా? లేదా చూసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, ఇతర వైద్య సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. గ్రామాల్లో సర్వేకు వెళ్తున్నప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు. వైద్యశాఖలోని ఔట్‌ సోర్సింగ్‌, కాంటాక్ట్‌, కాంటింజెన్సీ ఉద్యోగులెవరికైనా జీతాలు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

తెలంగాణలో 1400 దాటిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం(మే 14,2020) కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 47 కేసులను గుర్తించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1414కు చేరుకున్నాయి. గురువారం కరోనా నుంచి కోలుకొని 13 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 952 మంది అని వెల్లడించారు. కొత్తగా నమోదైన 47 కేసుల్లో 40 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. 

జీహెచ్ఎంసీలో డేంజర్ బెల్స్, సూర్యాపేట జిల్లాలో సున్నాకు చేరిన కేసులు:
గత ఆరు రోజుల కేసుల నమోదును పరిశీలిస్తే.. ఈ నెల 9న 30 కేసులు, 10న 33 కేసులు, 11న 79 కేసులు, 12న 37 కేసులు, 13న 31 కేసులు.. మొత్తంగా ఆరు రోజుల్లోనే ఇక్కడ 250 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఐదు రంగారెడ్డి జిల్లాలో, మరో రెండు వలస వచ్చిన వారిలో నిర్ధరించారు. వీరిరువురిలో ఒకరు నల్గొండకు వచ్చిన వలస వ్యక్తి కాగా, మరొకరు జగిత్యాలకు వచ్చిన వ్యక్తి. దీంతో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస ప్రజల్లో పాజిటివ్ గా గుర్తించిన వారి సంఖ్య 37కు చేరింది. గురువారం మరో 13 మంది కొవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకెళ్లారు. దీంతో సూర్యాపేట జిల్లా నుంచి కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా కోలుకున్నట్లే. జిల్లాలో మొత్తం 83 మందికి వైరస్ సోకగా అందరూ క్రమంగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది.

Read Here>> తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 51..వలస కూలీలకు వైరస్