Drone : భారత్ లో తొలి డ్రోన్ దాడి!

Drone : భారత్ లో తొలి డ్రోన్ దాడి!

Drone

Drone : ఉగ్రవాదుల చేతిలోకి అధునాతన డ్రోన్లు వచ్చాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. భారత్ లో ఆదివారం జరిగిన డ్రోన్ దాడే దీనికి నిదర్శనం. జమ్మూలోని వాయుసేన ఎయిర్ పోర్టులోని విమానాలు, హెలికాఫ్టర్లు నిలిపే ప్రదేశంలో జరిగిన దాడికి డ్రోన్లు ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో వాయుసేన వాహనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. కానీ ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. భవనానికి రంద్రం పడింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి 1:30 సమయంలో జరిగింది.

వాయుసేన ఎయిర్ పోర్టులో వేరు వేరు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో రెండు బాంబులు పేలాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాడి జరిగిన నిమిషాల్లోనే ఫోరెన్సిక్‌ సిబ్బంది, వాయుసేన బృందం, ఇతర భద్రతా దళాలు ఘటన స్థలికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్టులో ఉన్న అన్ని విమానాలను, హెలిక్టార్లను పరిశీలించారు. వీటికి నష్టం వాటిల్లలేదని తేల్చారు. యుద్ధ విమానాలు, హెలిక్టార్లను లక్ష్యంగా చేసుకొనే ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు అధికారులు.

తొలి సారి డ్రోన్ల వినియోగం..

భారత దళాలపై డ్రోన్లతో దాడి చేయడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. కాగా ఈ పేలుడులో ఓ భవనం పైకప్పుకు భారీ రంధ్రం పడింది. ఇది బాహ్య ప్రదేశంలో జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక ఇప్పటికే పాకిస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని ఉగ్రవాదులకు ఆయుధాలను తరలించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తుంది. అయితే ఈ డ్రోన్లను రాడార్లు గుర్తించలేవు. ఈ డ్రోన్లు 12 నుంచి 14 కిలోమీటర్ల పైన ఎగురుతూ ఆయుధాలను జారవిడుస్తాయి. వీటిని గుర్తించడం కొంచం కష్టమైన పనే.

 

దేశ సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను ఓ సారి చూద్దాం

* అమృత్ సర్ సమీపంలోని మోహవా గ్రామంలో 2019 ఆగస్టు 13న ఓ డ్రోన్ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* సెప్టెంబర్ – 22 – 2019 ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసి విచారించగా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 – సెప్టెంబర్ , 9 -16 మధ్య ఎనిమిది సార్లు డ్రోన్లు వచ్చి ఆయుధాలు, నగదు, మందుగుండు సామాగ్రిని జారవిడిచి వెళ్లాయని తెలిపారు.
* జమ్మూలోని హీరానగర్ సెక్టార్ లో 2020 జూన్ 20 వతేదీన బీఎస్ఎఫ్ ఒక నిఘా డ్రోన్ ను కూల్చివేసింది.
* జమ్మూకాశ్మీర్ లో 2020 సెప్టెంబర్ 19న భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. వీరిని విచారించగా సెప్టెంబర్ 18వ తేదీ వీరికి డ్రోన్ ద్వారా ఆయుధాలు సప్లై అయినట్లు తెలిపారు.
* అక్నూర్ సెక్టార్ లో డ్రోన్ సాయంతో 2020 సెప్టెంబర్ 22న ఆయుధాలు జారవిడిచినట్లు పోలీసులు గుర్తించారు.

 

ఇక ఈ నేపథ్యంలోనే డ్రోన్లను అడ్డుకునేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. సాఫ్ట్‌కిల్‌, హార్డ్‌కిల్‌ అనే విధానాలను డ్రోన్లను కంట్రోల్ చేసేందుకు వాడుతుంది. డ్రోన్‌ను గుర్తించి దాని కంట్రోలింగ్‌ సంబంధాలను నిర్వీర్యం చేయడం సాఫ్ట్‌కిల్‌ కోవలోకి వస్తుంది. ఇక ఆయుధాలు వాడి డ్రోన్‌ను కూల్చేయడం హార్డ్‌కిల్‌ కోవలోకి వస్తుంది.